భక్తి కాదు.. శక్తి ప్రధానం!

22-11-2026 | 05:20am

ఒకవైపు భారీ బడ్జెట్, అగ్రతారాగణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ‘రామాయణ’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటే.. మరోవైపు ఇతిహాసంలోని పాత్రల స్వరూపాలను మార్చి చూపించారనే విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా యశ్ పోషించిన రావణుడి పాత్రపై నితీశ్ భరద్వాజ్, ముకేశ్ ఖన్నా, సునీల్‌లహరి వంటి నటులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సినిమాపై ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.

ఇది రామాయణమా.. రావణాయణమా? 

రాముడిని బలహీనంగా, రావణుడిని గొప్ప నాయకుడిగా చూపించారంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు 

  1. యశ్ పోషించిన రావణుడి పాత్రపై తీవ్ర అభ్యంతరం
  2. ఇది ఒక ఎజెండా సినిమా.. నిధులపై విచారణ జరపాలి

నితేశ్ తివారీ దర్శకత్వంలో(Director Nitesh Tiwari) తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’(Ramayana) విడుదలైనప్పటి నుంచి చర్చనీయాంశంగా మారింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రావణుడి పాత్ర చిత్రీకరణ, రాముడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన తీరు,

ఇతిహాసంలోని కీలక ఘట్టాల మార్పులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టెలివిజన్ సీరియల్లో శ్రీకృష్ణుడిగా గుర్తింపు పొందిన నటుడు నితీశ్ భరద్వాజ్ ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘రామాయణ’ ఒక ఎజెండా సినిమా అని వ్యాఖ్యానించడమే కాకుండా, చిత్ర నిర్మాణానికి వచ్చిన నిధులపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

రావణుడి పాత్రపై నితీశ్ అభ్యంతరం

నితీశ్ భరద్వాజ్ ముఖ్యంగా యశ్ పోషించిన రావణుడి పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో రావణుడిలోని ప్రతికూల లక్షణాలను సరిగా చూపించలేదని, అతడిని ఉదారవాదిగా, సామాజిక న్యాయానికి కట్టుబడిన మంచి పాలకుడిగా చిత్రీకరించారని విమర్శించారు. రావణుడు ఒక మార్క్సిస్టు కమ్యూనిస్టు నాయకుడిలా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ‘రావణుడు అంత గొప్ప, న్యాయబద్ధమైన రాజు అయితే విష్ణువు రాముడిగా అవతరించాల్సిన అవసరం ఏముంది?’ అని దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాలను ప్రశ్నించారు.

రావణుడిని గొప్పవాడిగా, రాముడిని సాధారణ వ్యక్తిగా చూపించడం వల్ల అవతార సిద్ధాంతానికే అర్థం లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, రాముడు అయోధ్యను విడిచి వెళ్లే సన్నివేశంలో కన్నీళ్లు పెట్టుకోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

రాముడు అంటే మర్యాదకు, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వమని, సినిమాలో ఆ లక్షణాలు కనిపించలేదని అన్నారు. ఈ సినిమా నిర్మాణానికి సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయించారనే ప్రచారంపై కూడా నితీశ్ భరద్వాజ్ ప్రశ్నలు సంధించారు. నిర్మాణ సంస్థకు లక్సెంబర్గ్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల నుంచి నిధులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఈ నిధుల వెనుక ఉన్న మూలాలను, ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. అయితే, ఆయన చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారిత ఆధారాలు వెల్లడికాలేదు.

సునీల్ లహరి ఏమన్నారంటే..?

రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ టెలివిజన్ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహరి సైతం కొత్త ‘రామాయణ’పై స్పందించారు. సినిమాలో దైవత్వం, భక్తిభావం లోపించాయని అభిప్రాయపడ్డారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సినిమాలో చూపించలేదని, సంభాషణల్లోనూ ఆశించిన స్థాయి గాంభీర్యం కనిపించలేదని పేర్కొన్నారు. రావణుడిని కూడా అతిగా మహిమాపరిచారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా భక్తి ప్రధానంగా కాకుండా శక్తి ప్రధానంగా ఉందన్నది ఆయన అభిప్రాయం.

ట్రైలర్ చూసి ప్రశంసించి.. సినిమా చూశాక వెనక్కి తగ్గిన నితీశ్

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలుత ‘రామాయణ’ ట్రైలర్‌ను చూసిన నితీశ్ భరద్వాజ్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిభ, ఏఆర్ రెహమాన్ సంగీతం, భారీ బడ్జెట్ వంటి అంశాలపై ఆయనకు నమ్మకం ఉండేది. అయితే పూర్తిస్థాయి సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. రావణుడి పాత్రను మితిమీరిన సానుకూల దృక్పథంతో చూపించడం ఇతిహాసంలోని ధర్మాధర్మాల మధ్య ఉన్న మౌలిక సంఘర్షణను దెబ్బతీస్తోందని విమర్శించారు. 

యశ్ మూడు సినిమాలు.. రూ.3 వేల కోట్ల వసూళ్లు!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ మరో అరుదైన ఘనతతో వార్తల్లో నిలిచారు. కేవలం మూడు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తక్కువ సినిమాలతోనే భారీ బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న యశ్, ఆ తర్వాత ‘టాక్సిక్’, ‘రామాయణ’ చిత్రాలతో తన మార్కెట్‌ను మరింత విస్తరించారు.

ముఖ్యంగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’లో రావణుడిగా యశ్ నటన, సినిమాకు వచ్చిన అంతర్జాతీయ ఆదరణ ఆయన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ మూడు చిత్రాల ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.3 వేల కోట్ల మార్కును దాటడం విశేషం. తరచూ సినిమాలు చేయకుండా, భారీ స్థాయి కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపుతున్న యశ్ ప్రయాణం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. 

తెరపై రణ్‌బీరే కనిపించారు: ముకేశ్ ఖన్నా 

గతంలో ‘మహాభారత్’లో భీష్ముడిగా నటించిన ప్రముఖ నటుడు ముకేశ్ ఖన్నా కూడా ఈ సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్‌ను రాముడిగా గుర్తించలేకపోయానని, తెరపై రాముడి కంటే రణ్‌బీర్ కపూరే కనిపించారని వ్యాఖ్యా నించారు. సాధారణ కమర్షియల్ సినిమాలో హీరో పోరాడినట్లు రాముడి యుద్ధ సన్నివేశాలు ఉన్నాయని విమర్శించారు. ముఖ్యంగా రావణుడిని రాముడి కంటే గొప్పగా చూపించే ప్రయత్నం జరిగిందని, కథలో రావణుడి పాత్రకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అతడిని మహి మాపరిచారని ఆయన అభిప్రాయపడ్డారు. వాల్మీకి రామాయణంలోని అంశాలను మార్చి చూపించడం ఎంతవరకు సమంజసమని చిత్రబృందాన్ని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు