ముదిరాజ్ బిడ్డ ముఖ్యమంత్రి కావాలి
- కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ముదిరాజు బిడ్డనే గెలవాలి
- మత్స్యకార దినోత్సవ మహాసభలో టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో(Kollapur Constituency) శనివారం నిర్వహించిన 10వ మత్స్యకార మహాసభ వేడుకలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభ వేదిక వద్ద మత్స్యకార జెండాను ఆవిష్కరించారు. అనంతరం, తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భయ్యా వెంకటస్వామి నూతనంగా ఏర్పాటు చేసిన భయ్యా టీవీ ఛానల్ లోగోను ఆవిష్కరించారు.
అనంతరం సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముదిరాజులకు రూ. 500 కోట్ల బడ్జెట్, ప్రత్యేక కార్పొరేషన్, బీసీ-డీ నుంచి బీసీ-ఏ కి వర్గీకరణ కావాలని అడుగుతున్నారని, కానీ చరిత్రలో రాజులు ఎప్పుడూ అడుక్కు తినలేదని, ఇతరులకు పెడుతూ వచ్చారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలలో ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కి మారుస్తామని చెప్పి ముదిరాజులను మోసం చేశాయని మండిపడ్డారు.
వర్గీకరణ వల్ల కేవలం కులవృత్తిదారునిగా గుర్తింపు మాత్రమే వస్తుందని, కానీ ముదిరాజు బిడ్డల బతుకులు మారాలంటే ముదిరాజు ముఖ్యమంత్రి కావాలని, అసెంబ్లీలో చట్టాలు చేసే స్థానాల్లో కూర్చోవాలని అప్పుడే ముదిరాజుల బ్రతుకులు మారుతాయన్నారు. రాబోయే ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 100 శాతం ముదిరాజు బిడ్డనే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సూచించారు. అమరుడైన ఎర్ర సత్యమన్న పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని తాను ఈ ఉద్యమాన్ని ప్రారంభించానని, బీసీ ఆత్మగౌరవ పోరాటంలో ముదిరాజులంతా ఏకమై రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని కోరారు.