దేశ భవితకే నషా!

22-11-2026 | 05:25am
  1. భారత్‌కు యువతే అతిపెద్ద ఆస్తి
  2. మత్తుకు బానిసలవుతుండటం ఆందోళనకరం
  3. డ్రగ్స్ వెనుక విదేశీ కుట్రలు.. యువశక్తిని కాపాడుకోవాలి 
  4. దేశవ్యాప్తంగా 22 శాతం మంది పురుషులు మద్యానికి బానిసలు
  5. తెలంగాణలో ఆ సంఖ్య 44 శాతం
  6. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం
  7. డ్రగ్స్‌పై సమష్టి పోరు సాగించాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  8. యువశక్తిపై కుట్రలను తిప్పికొట్టాలి: ఎంపీ లక్ష్మణ్ 
  9. యువత రక్షణే దేశ ప్రయోజనం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

నవంబర్ 21 (విజయక్రాంతి): యువత దేశానికి అతిపెద్ద ఆస్తి అని, అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిసలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియా ఉచ్చును ఛేదించి యువశక్తిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన ‘సిటీ కన్వెన్షన్ ఆన్ డ్రగ్ ఫ్రీ ఇండియా’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దేశ యువతను మాదకద్రవ్యాల ఉచ్చులోకి నెట్టేందుకు విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ ప్రభావంతో యువత విచక్షణ కోల్పోయి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారి ఇప్పటికే పంజాబ్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోనూ మత్తు పదార్థాల చలామణి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. నగరంలోని మూతపడిన పరిశ్రమలను అడ్డాలుగా చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారని, కొన్ని ఇళ్ల మేడలపైనా గంజాయి మొక్కలు పెంచుతున్నారని తెలిపారు.

దేశవ్యాప్తంగా సగటున 22 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తుంటే, తెలంగాణలో ఆ సంఖ్య 44 శాతంగా ఉండటం ఆందోళనకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ ఆదాయం కోసం ప్రభుత్వాలు మద్యంపై ఆధారపడటం, తాగడాన్ని సమాజం ఫ్యాషన్‌గా భావించడం ప్రమాదకరమని హెచ్చరించారు.

దేశంలో దాదాపు మూడు కోట్ల మంది గంజాయికి అలవాటుపడగా, వారిలో 70 లక్షల మంది తీవ్ర వ్యసనానికి లోనయ్యారని తెలిపారు. అంతర్జాతీయంగా మాదకద్రవ్యాల వ్యాపారం సుమారు 800 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. డ్రగ్స్ సమస్యను కేవలం ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలతోనే పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని కిషన్ రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, పౌర సమాజం సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారి నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. 

25 నుంచి 27 వరకు ‘హైదరాబాద్ వాక్స్’ 

డ్రగ్స్ మహమ్మారి దుష్ర్పభావాలపై యువత, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంతోపాటు సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ‘హైదరాబాద్ వాక్స్’ పేరుతో మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. సినీ, క్రీడా, వైద్య, ఐటీ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ పాదయాత్రలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనులను కలిసి ఆహ్వానించినట్లు చెప్పారు.  

శత్రుదేశాల కుట్రలు : ఎంపీ లక్ష్మణ్

‘నషా ముక్త్ భారత్’పై ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. భారత యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి, వారి శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేసేందుకు శత్రుదేశాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. భారత యువత క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ దేశ ప్రతిష్ఠను పెంచుతోందని, అలాంటి యువశక్తిని మత్తుపదార్థాల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ‘నషా ముక్త్ భారత్’ సంకల్పాన్ని చేపట్టారని తెలిపారు. ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలిజాన్ని అణచివేసిన తరహాలోనే రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని కూడా సమూలంగా రూపుమాపాలని లక్ష్మణ్ పేర్కొన్నారు.

భావితరాల రక్షణకు సమష్టి పోరాటం : రాంచందర్ రావు

మాదకద్రవ్యాల బారి నుంచి దేశ యువతను, భావితరాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, అందుకు సమష్టి పోరాటం అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చడం ద్వారా భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా దేశ సరిహద్దుల్లోని కొన్ని రాష్ట్రాల్లో మాదకద్రవ్యాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఎంతోమంది యువకులు వాటికి అలవాటు పడి, తమ విలువైన జీవితాలను,

ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి యువతను రక్షించి, దేశ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే మహోన్నత లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టే ప్రతి కార్యక్రమం వెనుక ‘నేషన్ ఫస్ట్’ (దేశమే ప్రథమం) అనే బలమైన సంకల్పం దాగి ఉందన్నారు. ప్రధాని ఇచ్చిన ‘స్వచ్ఛ భారత్’

పిలుపుతో దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెరిగి, గణనీయమైన మార్పులు వచ్చాయని గుర్తుచేశారు‘స్వస్థ భారత్’ లక్ష్యంతో ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందని వివరించారు. ‘ఖేలో ఇండియా’ వంటి వేదికల ద్వారా యువత క్రీడల్లో ఉత్సాహంగా రాణిస్తూ, ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని ప్రశంసించారు. ‘భారతదేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలన్నా, ప్రపంచ స్థాయిలో తన సంపూర్ణ సామర్థ్యాన్ని చాటుకోవాలన్నా ముందుగా మన యువతను కాపాడుకోవాలి’ అన్నారు.

నార్కో టెర్రరిజం కుట్రగా చూడాలి : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 

మాదకద్రవ్యాల ముప్పును కేవలం మత్తు పదార్థాల సమస్యగా చూడకుండా, దేశ యువశక్తిని నిర్వీర్యం చేసే నార్కో టెర్రరిజం కుట్రగా పరిగణించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తొలుత ఉచితంగా డ్రగ్స్ అందించి, ఆ తర్వాత యువతను వాటికి బానిసలుగా మార్చే ప్రమాదకర ధోరణి వెనుక ఉన్న కుట్రలను సమాజం గుర్తించాలని హెచ్చరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ర్టంలో ఇప్పటివరకు ఎన్ని డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి? ఎంతమందిని అరెస్టు చేశారు? ఎంతమొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు? అనే వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

సమాజానిదే కీలక బాధ్యత: డాక్టర్ జయప్రకాష్ నారాయణ 

ఉగ్రవాదాన్ని ప్రభుత్వం, చట్టాలు, పోలీసు వ్యవస్థ సమన్వయంతో అరికట్టవచ్చని, కానీ మత్తు పదార్థాల మహమ్మారిని నియంత్రించడంలో కుటుంబాలు, సమాజంపైనా బాధ్యత ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. పొగతాగడం, పొగాకు వినియోగం, మద్యపానం మొదలుకొని గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వరకు అన్నింటినీ ఒకే కోణంలో చూడాలని సూచించారు. చైన్ స్మోకింగ్ కారణంగా బర్జర్స్ వ్యాధి బారినపడి రెండు కాళ్లూ కోల్పోయి కన్నీరుమున్నీరైన వారిని వైద్యుడిగా తాను ఎంతోమందిని చూశానని గుర్తుచేశారు.

సినిమాల్లోనూ వ్యసనాలను ఆకర్షణీయంగా చూపించడం ప్రమాదకరమన్నారు. ఆయుధాలు, అధునాతన సాంకేతికతతో పనిచేస్తున్న అంతర్జాతీయ నేర ముఠాల నుంచి దేశాన్ని కాపాడేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని జయప్రకాష్ నారాయణ తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన సూచించారు. వ్యసనానికి బానిసైన వారి కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ మాఫియా ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని కోరారు. వ్యసనానికి లోనైన యువతపై కేసులు నమోదు చేయకుండా వారికి కౌన్సెలింగ్ కల్పించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలన్నారు. అమెరికా, నెదర్లాండ్స్, పోర్చుగల్ వంటి దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, మన పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీ య పరిష్కారాలు రూపొందించాలన్నారు. 

పిల్లలను గమనిస్తుండాలి : గరికిపాటి నరసింహారావు

పిల్లల పెంపకంలో తల్లితండ్రులు నిర్లక్ష్యం వహించకూడదని, ముఖ్యంగా తండ్రులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పేర్కొన్నారు. పిల్లలను అతిగా గారాబం చేయకుండా, చెడు అలవాట్ల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. వారి స్నేహితులు, ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలన్నారు. డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాల నుంచి పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలని, అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడం, కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు.   

‘నషా ముక్త్ భారత్’కు వెంకటేశ్ మద్దతు

‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (హైదరాబాద్ వాక్స్)కు ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి యాత్రలో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీషర్టులను ఆవిష్కరించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యతని వెంకటేశ్ పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు