అడ్మిషన్ల దందా!

22-11-2026 | 05:25am
  1. టెన్త్ పరీక్షలకు ముందే కార్పొరేట్ జూనియర్ కాలేజీల హడావుడి
  2. ఫీజు రాయితీల ఎరతో తల్లిదండ్రులకు వల
  3. ఫోన్లు, వాట్సాప్‌ల ద్వారా సందేశాలు
  4. ఐఐటీ, నీట్ పేరుతో అడ్వాన్స్ సీటు గ్యారంటీ పేరుతో 20 వేల
  5. నుంచి 50 వేలు వసూలు నిబంధనలు బేఖాతరు.. పట్టించుకోని ఇంటర్ బోర్డు

నవంబర్ 21 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షల షెడ్యూలే ఇంకా వెలువడలేదు.. కొత్త విద్యాసంవత్సరానికి మరో ఏడు నెలల సమయం ఉంది.. కానీ కార్పొరేట్(Corporate) ‘చదువు దుకా ణాలు’ అప్పుడే తెరుచుకున్నాయి! సేవ స్థానంలో వ్యాపారాన్ని తెచ్చిపెట్టిన కార్పొరేట్ జూనియర్ కాలేజీలు(Corporate Junior Colleges), వచ్చే ఏడాది ఇంటర్ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేశాయి. ముందస్తుగా బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్.. ఆలస్యం చేస్తే సీటు దొరకదు అంటూ ఫోన్లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఇంటింటి ప్రచారంతో తల్లిదండ్రులను భయపెడుతూ అడ్వాన్స్ బుకింగ్‌ల దందాకు తెరలేపాయి.

పదో తరగతి పరీక్షలు సాధారణంగా మార్చిలో జరుగు తుంటాయి. పరీక్షలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ, కార్పొరేట్ కాలేజీలు మాత్రం వచ్చే విద్యాసంవత్సరానికి ఇప్పటి నుంచే అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి. ఐఐటీ, నీట్ కలలు చూపుతూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయి. సీటు దొరకదు, ఆఫర్ పోతుంది అంటూ భయపెడుతున్నాయి.

మొదలు ఎంతో కొంత ఫీజు తీసుకొని సీటు బుక్ చేయిస్తున్న కళాశాలలు, వాటికి రశీదు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. నెల గడిచాక కాలేజీ ఫీజులో రూ.20 వేల నుంచి రూ.50 వేలు కట్టి సీటు కన్‌ఫర్మ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. విద్యార్థి మనసు మార్చుకుని వేరే కాలేజీలో చేరాలనుకున్నా ఆ డబ్బు వెనక్కి రాదు. మరో కాలేజీకి వెళ్లకుండా ఫీజులో 30 శాతం వరకు ముందే వసూలు చేసి తల్లిదండ్రులన లాక్ చేస్తున్నారు.

తల్లిదండ్రుల బలహీనతలూ కారణమే!

వాస్తవానికి కార్పొరేట్ కళాశాలల ముందస్తు దందాకు తల్లిదండ్రుల బలహీనతలు కూడా కారణమేనని తెలుస్తోంది. పక్కింటి వాళ్లు సీటు బుక్ చేశారు, మనం చేయకపోతే మన పిల్లాడికి సీటు దొరకదేమోననే భయం.. మంచి కాలేజీలో చేరకపోతే ఐఐటీ, నీట్ ర్యాంక్ రాదన్న ఆందోళన.. ఆఫర్ పోతే రాయితీ పోతుందేమోననే గుబులు.. ఇలా తల్లిదండ్రుల బలహీనతలను కార్పొరేట్ కాలేజీలు చక్కగా వాడుకుంటున్నాయి. పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రుల ఆందోళనను కార్పొరేట్ కాలేజీలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి.

ఇప్పుడు సీటు బుక్ చేసుకోకుంటే తర్వాత దొరుకుతుందో లేదోననే ఆందోళన వారిలో కనబడుతోంది. రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో మూడింట రెండొంతుల మంది ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. చదువు అంటే సేవ అనే భావన పోయి, చదువు అంటే ప్రొడక్ట్, విద్యార్థి అంటే కస్టమర్ అనే భావన వచ్చేసింది. అందుకే అడ్మిషన్ అంటే ఇప్పుడు కాలేజీకి వెళ్లి చేరడం కాదు, ఆఫర్ చూసి బుక్ చేసుకోవడం అయిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజులను నిర్ణయించే అధికారం ప్రభుత్వాల చేతిలో లేనంత వరకూ ఈ చదువుల దుకాణానికి గిరాకీ ఫుల్‌గానే ఉంటుంది. 

బోర్డు నిబంధనలు బుట్టదాఖలు

ఇంటర్ బోర్డు నిబంధనలు బుట్టదాఖలు అవుతున్నాయి. నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే ఇంటర్ అడ్మిషన్లను ప్రారంభించాలి. అడ్మిషన్ల కోసం కాలేజీలు సొంతంగా ప్రవేశ పరీక్షలు పెట్టకూడదు. అనుమతి ఉన్న సెక్షన్లకు మించి అడ్మిషన్లు తీసుకోవద్దు. గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే చేరాలి. ఇంటర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ ఫిబ్రవరిలో మొదలవుతుంది. అప్పుడే గుర్తింపు కోసం కాలేజీలు బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డు నిబంధనలు పాటిస్తేనే ఆయా కాలేజీలకు గుర్తింపు వస్తుంది.

గుర్తింపు వచ్చిన కాలేజీల జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. అప్పుడు కాలేజీల గుర్తింపును బట్టి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి. ఈ నిబంధనలన్నీ కాగితాల మీద మాత్రమే ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో వాటిని ఎవరైనా పాటిస్తున్నారా? అంటే సమాధానం లేదనే చెప్పాలి. ఇంటర్ బోర్డులో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఉన్నారు. కాలేజీలను తనిఖీ చేయడం, ముందస్తు అడ్మిషన్లను అడ్డుకోవడం, ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం, నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? లేదా?

అనేది చూసుకోవడం వారి బాధ్యత. కానీ వారు కళ్లు మూసుకుని కూర్చుంటున్నారనే ఆరోపణలున్నాయి. స్కూళ్ల ముందు పాంప్లెట్లు పంచినా, ఫోన్లు చేసి వేధించినా ఎవరూ అడగడం లేదు. మరోవైపు పాఠశాల విద్యలో ఇప్పటికే బోర్డు విలీనం నిర్ణయంతో కార్పొరేట్ కాలేజీలు మరింతగా తమ వ్యాపారాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి. వీలీనమనే అయోమయాన్ని కార్పొరేట్ కాలేజీలు అవకాశంగా మార్చుకుంటున్నాయి. 

మరిన్ని వార్తలు