ఎగుమతులతో రక్షణ రంగాభివృద్ధి
ఇస్కా రాజేష్ బాబు :
భారత రక్షణ రంగం(India Defence Sector) ప్రస్తుతం దేశీయ ఉత్పత్తి(Domestic production), స్వయం సమృద్ధి(Self-sufficiency) (ఆత్మనిర్భర్ భారత్) రికార్డు స్థాయి ఎగుమతులతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ సుమారు 88 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 15.2 శాతం ఎక్కువ. 2029 నాటికి రక్షణ ఎగుమతులను(Defence exports) రూ. 50,000 కోట్లకు పెంచుకో వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
2025--26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ. 38,424 కోట్లకు (4.35 బిలియన్ల అమెరికన్ డాల ర్లు ) చేరుకుని, క్రితం ఏడాదితో పోలిస్తే 62.66శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి విలు వ రూ. 1,77,995 కోట్లకు (20.14 బిలియన్ల అమెరికన్ డాలర్లు) పెరిగింది. బ్ర హ్మోస్ వంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, తేజస్ లాంటి తేలికపాటి యుద్ధ విమానాలు, ఆర్టిలరీ గన్స్ వంటి స్వదేశీ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.
దేశీయ తయారీపైనే దృష్టి
విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకుంటూ, తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి స్వదేశీ యుద్ధనౌకల తయారీకి ప్రభుత్వం పెద్దపీట వేసింది. భారత్ తన వ్యూహాత్మక అణుత్రయ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూ సుమారు 190 అణు వార్‌హెడ్‌ల ను కలిగి ఉంది. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్, తమిళనాడు లలో ప్రత్యేకంగా రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయబడ్డాయి.
80కిపైగా దేశాలకు మన పరికరాలు
భారత రక్షణ పరికరాలు ఇప్పుడు 80కి పైగా దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. 2025--26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఎగుమతులు రూ. 38,424 కోట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని రూ. 23,622 కోట్ల గణాంకాలతో పోలిస్తే రూ. 14,802 కోట్లు (62.66శాతం) అధికం. ఇందులో రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు 54.84శాతం కాగా, ప్రైవేట్ రంగం 45.16శాతం వాటాను అందించాయి.
గతేడాదితో పోలిస్తే డీపీఎస్‌యూల ఎగుమతులు 151శాతం మేర భారీగా పెరగగా, ప్రైవేట్ సంస్థలు 14శాతం వృద్ధిని నమోదు చేశాయి. విలువ పరంగా చూస్తే, ప్రైవేట్ రంగం రూ. 17,353 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులను చేపట్టగా, డీపీఎస్‌యూలు రూ. 21,071 కోట్ల వాటాను అందించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వీటి విలువలు వరుసగా రూ. 15,233 కోట్లు, రూ. 8,389 కోట్లుగా ఉన్నాయి.
రక్షణ రంగం బలోపేతం
దేశీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. భారత వాయుసేన కోసం తలపెట్టిన రూ.3.25 లక్షల కోట్ల మెగా రఫేల్ డీల్‌లో భాగంగా అందించాల్సిన 114 యుద్ధ విమానాల్లో 94 జెట్లను భారత్‌లో తయారు చేసేందుకు ఫ్రాన్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ అధికారిక ప్రతిపాదన సమర్పించింది. ఇది కార్యరూపం దాలిస్తే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాలు తయారవడం ఇదే తొలిసారి కానుంది. భారత్ ఈ ఏడాది మే నెలలో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ (ఎల్వోఆర్)ను ఫ్రాన్స్‌కు పంపింది.
దానికి ప్రతిస్పందనగా ఆ దేశం తాజాగా ఈ పూర్తిస్థాయి ప్రతిపాదనను భారత్కు సమర్పించింది. దీనిలో భారత్లో తయారీ, సాంకేతికత బదిలీ, స్వదేశీ ఆయుధాల అనుసంధానానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఫ్రాన్స్ ప్రతిపాదనల్లో ముఖ్యమైనది తాను అందించాల్సిన 114 రఫేల్ యుద్ధ విమానాల్లో 94 జెట్లను భారత్‌లోనే స్థానిక సంస్థల భాగస్వామ్యంతో తయారు చేయడం. ఈ కార్యక్రమంలో దసో ఏవియేషన్‌తో పాటు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థలైన ఎంబీడీఏ, సాఫ్రాన్, థేల్స్ కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఈ ప్రాజెక్టు కింద పరిశ్రమల భాగస్వామ్యంతో సుమారు రూ.1.6 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని అంచనా.
నిశితంగా పరిశీలిస్తున్న భారత్
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసే రఫేల్ ప్లాట్‌ఫాంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థలను, ముఖ్యంగా అస్త్ర మిస్త్స్రల్ రకాలను అనుంధానించే నిబంధనలపై ఫ్రాన్స్ చేసిన ప్రతిపాదనను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. గాలి, నేల, సముద్రం ఈ మూడు మార్గాల ద్వారా ఒకేసారి అణ్వాయుధాలను ప్రయోగించగల ‘న్యూక్లియర్ ట్రయాడ్’ వ్యవస్థలను భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తోందని హాన్స్ క్రిస్టెన్సెన్ అన్నారు. 2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద సుమారు 730 కిలోల వెపన్- గ్రేడ్ ప్లుటోనియం ఉన్నట్లు అంచనా వేశారు.
ఒక్కో వార్‌హెడ్‌కు 4 కిలోల ప్లుటోనియం అవసరం అనుకున్నా ఈ నిల్వలు 140 నుంచి 225 వార్‌హెడ్‌ల తయారీకి సరిపోతాయని తెలిపారు. అయితే భారత్ తన వద్ద ఉన్న ప్లుటోనియం మొత్తాన్ని ఆయుధాల తయారీకే వాడకపోవచ్చని, కొంత రిజర్వ్‌గా ఉంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొమ్మిది దేశాల వద్ద కలిపి 12 వేలకు పైగా అణ్వాయుధాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఏడాది వ్యవధిలో భారత్ మరో 10 వార్‌హెడ్‌లను అదనంగా సమకూర్చుకుని తన ఆయుధగారాన్ని బలోపేతం చేసుకుంది. చైనా విషయానికి వస్తే, ఆ దేశం వద్ద ఏకంగా 620 అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి నివేదికలో వెల్లడించింది.
వాయుసేనకు రఫేల్ కీలకం
భారత్ ఇప్పటికే పాతబడిన మిగ్ యుద్ధ విమానాలను దశల వారీగా ఉపసంహరించుకుంటోంది. అలాగే తేలికపాటి యుద్ధ విమానాలైన ఎల్సీఏ ఎంకే1ఏ, త్వరలో అందుబాటులోకి రానున్న ఎల్సీఏ ఎంకే2 వంటి స్వదేశీ విమానాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా స్క్వాడ్రన్ బలం తగ్గుతోంది. ఈ లోటును అత్యాధునిక రఫేల్‌తో భర్తీ చేయాలనేది భారత్ లక్ష్యం. ఈ క్రమంలో 2024లో చేసిన 114 రఫేల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ సేకరణ మండలి 5నెలల క్రితం ఆమోదం తెలిపింది. భారత వాయుసేన, నౌకాదళం కోసం ఇప్పటికే 62 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇచ్చారు.ప్రతిపాదిత 114 రఫేల్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే భారత్ వద్ద ఉండే రఫేల్స్ సంఖ్య 176కు పెరుగుతుంది.
- సీనియర్ జర్నలిస్ట్, 93973 99298