ఇది ఒక చైతన్య ‘కవితా’ ప్రపంచం!

16-11-2026 | 05:00am

కవిత్వం(Poetry) ఒక్క క్షణంలో దశాబ్దాల బతుకు ఛట్రాలను మార్చదు. ఆకలి బాధల్ని వెంటనే తొలగించదు. తరతరాల అణచివేతను ఒక పద్యం తో అంతం చేయదు! కానీ అది మనిషి అనాగరిక, అజ్ఞాన ఆలోచనల్లో మార్పు తీసుకురాగలదు. ఆ మార్పు సమాజం నలుమూలల చర్యగా మారినప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కవిత్వం సమూల మార్పుకు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు.

కానీ మార్పు కోసం చైతన్యాన్ని నిర్మించే ఓ శక్తి. కవిత కుందుర్తి వారసత్వ రక్తమంతా కవన కిరణాలతో అనునిత్యం ప్రకాశిస్తూ కొన్ని సంకుచిత సంప్రదాయాలు, మూఢనమ్మకాలపై ఆధునిక వేగం తో యుద్ధం చేస్తూ జ్ఞానోదయమై వికసించింది. ‘జస్ట్ ఏ హౌజ్ వైఫ్’ చిరునవ్వులు చిందిస్తూ సమాజమంతా కవితోదయ కాంతులతో వెన్నెల మౌనా న్ని ధిక్కరించుకుంటూ పలుకుతున్న తొలి మాటల తోట.. ఇది ఎప్పటికీ ఆగని అక్షర తూట!

నీ కౌగిట్లోని వెచ్చదనం నా గుండెల్లో ఇంకా సవ్వడి చేస్తూనే ఉందంటూ నాన్న కోసం ఓ కవిత..’ ఇట్లు నీ కవిత’గా మారిపోయింది. నువ్వు గీయలేదు గానీ నేనెన్నో గీతలు దాటా ను ఎందుకు నన్నొక్కసారీ తిట్టలేదంటుంటే.. నాన్నలందరూ కుందుర్తి కవిత రాసిన కవితలో కనిపిస్తున్నారు. ఏదేమైనా ఈ కవిత సమాజంలోని నాన్నను సరిగ్గా అర్థం చేసుకుంది; నా ఏకైక హీరో నువ్వంటూ నాన్నకు అక్షరార్చనతో ప్రాణప్రతిష్ట చేసింది.

గమ్యానికి చేరానో, చేరాల్సిన చోట జారి కిందపడ్డానో తెలీని అయోమయం తర్వాత.. మర్చిపోయాననుకున్న అసలు ముఖం కాలానికి అవతల నవ్వుతూ కనిపిస్తుందంటూ ఓ సన్నని సుపరిచిత స్వరం ‘అసలు నేను’ కను తెరిచింది. ఇక మారడం నాకు అనివార్యమంటూ తనకు తానై రం గులు అద్దుకునే కొత్త ముఖమై కనిపిస్తుంది. పాత పుస్తకం పేజీల మధ్య గులాబీ పువ్వునై దొరికిపోతే దుమ్మని చెప్పి దులిపేసుకుందువులే ఇదంతా వద్దులే గానీ అంటుంది! అహాల మధ్య మరబొ మ్మల్లా నవ్వగలిగే గొప్పోళ్ళను చూస్తోంది బ్రేకప్ స్టోరీలో!

శరీరం శూన్యం అవుతుంది/ కొన్ని రోజుల తుఫాను రాత్రులవుతూ సమస్త గాయాలకీ లేపనం.. లోపలెక్కడో చివురంత ప్రేమ నామీద నాకే! వంటి అనంతమైన భావ గాఢతలోని సామాన్య భాషతో కవిత్వ స్వరాలను సృష్టించి రాగాలాపన చేయడం ఈ పుస్తకంలో చాలా చోట్ల కనిపిస్తుంది. పాఠకులకు తెలియని ఓ అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించేలా చేస్తుంది.

పోయేందుకు ఇం‘ధనం’ కూడబెట్టండి.. అంటూ మానవత్వం మర్చిపోయిన కోట్లాదిమంది మహాత్ములకు స్వీట్ వార్నింగ్ ఇస్తుంది రచయిత! కలిసి చిగురించలేని కుదురులోంచి నేల రాలడం నాకభ్యంతరం లేదు.. కిందపడిన ఆకు మట్టిలో కలిసిపోతుంది. ఆ కొత్త సారం కడుపులోంచి మళ్లీ పుట్టడం నాకిష్టం అంటూ ఓ సామాజిక సమస్యపై పదునైన ప్రకటన చేసింది.

ప్రతిరోజు కొత్త చిగురులతో జీవించేలా ఓ జీవన తాత్విక సందేశాన్ని వినిపిం చింది. ఎంత ధైర్యం ఉండాలి రచయితకి..! అవమానాల వానల్లో తడిచి వణికినప్పుడు జాలి గొడుగైనా పట్టని మీకు ప్రశ్నల వర్షం కురిపించే హక్కుందా అంటూ మరో శ్రీశ్రీలా మాట్లాడుతోంది! కల్పనా చావ్లా ప్రతిరూపమై ప్రతిధ్వనిస్తోంది!!

ప్రారంభంలోనే రగులుకున్న యుద్ధంలో పసికందులు పచ్చటి ఆకుల్లా రాలిపడుతున్నారంటే పాఠకుల హృదయాలు కన్నీటి వర్షంలో తడిసిపోవా మరి! గుండెల్లో నేలను దాచుకున్న వాళ్లమే మనం.. అందుకే భావోద్వేగాల ప్రవాహంలో మనమంతా తడిసిపోక తప్పదు! యుగాల తరబడి తవ్వి తీసిన సంప్రదాయాల గోతుల్లోకి కవయిత్రి కలం కలవరమైంది.

కలబడుతూనే ఉంది ఇంకా! రాగం లేని పాట/ భావం మారిన కవిత/ నువ్వొదిలిన నేను.. గదంతా జ్ఞాపకాల సువాసనలతో మంత్రదండం వినిపిస్తూనే ఉంది. నువు మనుగడకీ/నేను మగాడికీ/ ఎవరి చేతిలో ఎవరు చిక్కుకున్నదీ ఎప్పటికీ చిక్కువిడని ప్రశ్నల మధ్య ’జీవితం’ లోలకంలా మారి కవిత గారి కవిత్వంలో డోలనాలు చేస్తుంది.

మెత్తటి కలల తివాచీలు పరిచి/ పురాకల్ప పరదాలు దులిపి/ వేచి చూస్తోందో కొత్త వేకువ తో రంగులు అద్దుకున్న ముఖచిత్రాన్ని కొత్త అనుభవమై మాట్లాడుతుంది. చర్మం మీద ప్రశ్నల ముడతల గురించి దాగని వెలుగై ఆత్మీయ స్పర్శతో కవిత గారి కొన్ని అక్షరాలు ఆరు బయటే పెంచిన తల్లిలా, కౌగిలించుకున్న అక్కలా అగుపిస్తున్నాయి. కడలి తరగల మీద కవితలవుతున్నాయి..! తిరిగే ప్రతీ మలుపులోనూ కొత్తదారిని వెతుకుతూ, నచ్చినట్టు బతకమనే తాత్విక మూలాలను గుర్తు చేస్తున్నాయి. 

‘చంపుకునే వాళ్ళే విలన్లయితే నువ్వే లోకంలో అతిపెద్ద విలన్ వి/ మాకోసం నువ్వెన్ని కోరికలని చంపుకున్నావో?/ అమ్మనయ్యా గానీ, ఆ మృధుత్వం ఇంకా నాకు అబ్బనే లేదు/ అమ్మా ! నా వాకిట ముగ్గులోకి రం గువై రావా..’ ఇలా అమ్మలోని ఒంటరితనం ఓ అమ్మలా ఆలోచించి, అక్షరాల్లో అమ్మని ప్రతిష్టిస్తుంటే.

మాతృదేవోభవ అంటూ రెండు చేతులెత్తి అమ్మలందరికీ మరొక్కసారి నమస్కారం చేస్తూ కాసేపు మౌనాన్ని ఆశ్రయించాలి! అద్దం వెనక దాచిన అస్తిత్వం శాశ్వత నిశ్శబ్దమై ముగిసి ముగి యకుండా ఉగిసలాడుతూనే ఉంది! కలల్ని తడిమే వెలుగుల కోసం శిలాలా వేచి ఉండడమూ జీవితాన్ని కరిగించడమే వంటి వాక్య కుసుమాలతో పుస్తకం నిండా ఓ హృదయం దాగి ఉంది. పాఠకులందరికీ ప్రేరణ ఇస్తూనే ఉంది!

అవే అక్షరాలతో.. అవే ఉపమానాలతో దశాబ్దాల తరబడి అలసిపోతున్న మనకు... కవిత కుందుర్తి గారు ఆధునికతను తన అక్షరాల్లో నింపుకొని కలాన్ని కాల గుండెపై కొత్త ఒరవడితో కదిలించారు. నవతరం, రేపటి తరాలు చదివే కవిత్వాన్ని తనదైన శైలిలో స్పృశించారు. ఎంతోమంది పెద్దలు తన కవిత్వానికి పదను పెట్టారని సవినయంగా ఆమె చెప్పుకుంటున్నప్పటికీ ఆమె అక్షరం ఓ సంచలన స్వరం!

జస్ట్ ఎ హౌజ్ వైఫ్.. బిగినింగ్ టైటిల్ మాత్రమే! సిని మా ఇంకా చాలానే ఉందని చెప్పవచ్చు! ఇది అమ్మాయిలందరూ చదవాల్సిన పుస్తకం! అబ్బాయిలందరూ అర్థం చేసుకోవాల్సిన సందర్భం! సమాజమంతా చర్చించాల్సిన సందేశం! ఇక ఆలస్యం ఎందుకు? కవిత కవిత్వం కోసం నేను సైతం అంటూ మరో ప్రపంచంలోకి అడుగేద్దాం!

 9394749536


మరిన్ని వార్తలు