పెట్టుబడి కంపెనీలుగా పార్టీలు

05-11-2026 | 05:00am

డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ : 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు(Elections) ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్ ప్రణాళికలకు దర్పణం పట్టే పవిత్ర ఉత్సవాలు. అందులో ఓటర్లే అసలైన యజమాను లు, పాలకులు ప్రజాసేవకులు. కానీ నేడు ఆ వ్యవస్థ తలకిందులైంది. పలు రాజకీయ పార్టీలు(Political Parties) ప్రజాస్వామ్య వేదికలకంటే ‘కార్పొరేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు’గా మారిపోయాయి. కార్పొరేట్ సంస్థలు(Corporate organization) ఒక ప్రాజెక్టు కోసం పెట్టుబడి పెట్టినట్లే, రాజకీయ నాయకులు(Political leaders) కూడా ఎన్నికల్లోకి దిగేముందే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

పెట్టిన ప్రతి రూపాయిని గెలిచిన తర్వాత వడ్డీతో సహా రాబట్టుకోవా లనే ధోరణి పెరిగింది. ఈ ఇన్వెస్ట్ మెంట్ మోడల్లోనే అసలైన ప్రమా దం దాగుంది. ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా, తెరవెనుక చక్రాలు తిప్పే కార్పొరేట్ శక్తు లు, ఆధిపత్య వర్గాలు ప్రధాన పార్టీలతో ముందు గానే లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

అందుకు ప్రతిగా మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వాలు విధానాలను రూపొందిస్తున్నాయి. కార్పొరేట్లు విపరీతంగా లాభాలు ఆర్జిస్తుంటే, సామాన్య ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు. బీసీ వర్గాలు, ఉత్పాదక కులాలు తమ శ్రమతో సృష్టించిన సంపదనే కొందరు  దోచు కుంటున్నారు. వ్యాపారు లు, దళారీల దోపిడీకి సహకరిస్తూ రైతుల ప్రయో జనాలను కాలరాస్తున్నారు.

ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల ఆవశ్యకతను విస్మరించలేం. ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు, ప్రజా ఉద్యమాల చరిత్ర చూస్తే, కేవలం ప్రజా తిరుగుబాట్లు మాత్రమే సమాజంలో శాశ్వత మార్పును తీసుకురా లేవు. పీడిత వర్గాలు ఎంతగా ప్రతిఘటించినా, ఆ శక్తిని నిర్దిష్ట లక్ష్యం వైపు నడిపించే రాజకీయ పార్టీ లేకపోతే ఉద్యమాలు నిష్ఫలమవుతాయి. అయితే, డబ్బుతో నడిచే రాజకీయాలను ఓడించాలంటే కేవలం డబ్బు సరిపోదు. ఆత్మగౌరవం, అస్తిత్వం, సామాజిక న్యాయం లాంటి భావోద్వేగపూరిత ఉద్యమాలే ధనబలాన్ని నిరోధించగలవు.

1982లో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో భారీ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను ఢీకొట్టి కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభంజనం సృష్టించారు. అక్కడ గెలిచింది ధనబలం కాదు, ప్రజల ఆత్మగౌరవం. దశాబ్దాల నిరాదరణకు గురైన ప్రాంతీయ వేదనను కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌తో స్వయంపాలన సాధించారు. కాన్షీరామ్ ఓటు మాది  సీటు మీదా? నడవదు, నడవదు! అనే నినాదంతో సామాజిక న్యా యాన్ని ముందుకు తెచ్చారు. తమిళనాడులో విజయ్ ‘పిరప్పొక్కుమ్ ఎల్లా ఉయిరుక్కుమ్ (పుట్టుకతో జీవులన్నీ సమానమే)’ అనే నినాదంతో కుల, మత, లింగ భేదాలు లేని సామాజిక సమతను ప్రచారం చేశారు.

బీసీ రాజ్యాధికారం : తెలంగాణలో తీన్మార్ మల్లన్న ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని స్థాపిం చి, జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలను ఓటుబ్యాంకుగా చూసే విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. మా జనాభా ఎం తుందో, చట్టసభల్లో మా ప్రాతినిధ్యం అంతే ఉండాలనే ‘జై బీసీ’ నినాదాన్ని బలమైన ఉద్యమంగా మార్చడానికి 14,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రూపా యికి అమ్ముడుపోని ఓటింగ్ వ్యవస్థ సాధ్యం కావాలంటే ప్రజల్లో భావ జాలాన్ని ప్రచారం చేయాలి. డబ్బుతో డబ్బును ఎదిరించలేకపోవచ్చు, కానీ అస్తిత్వ పోరాటంతో ఖచ్చితంగా ఓడించవచ్చు.

ఈ ‘టెండర్’ రాజకీయం నుంచి బయటపడా లంటే పార్టీలకు వచ్చే విరాళాలపై, ఎన్నికల ఖర్చుపై కఠినమైన చట్టాలు రావాలి. పార్టీల నిధుల ప్రవాహం బహిరంగం కావాలి. డబ్బుకు అ మ్ముడుపోతే, ఐదేళ్ల భవిష్యత్తు ను తాకట్టు పెట్టినట్లే అనే స్పృ హ ఓటర్లలో రా వాలి.  అప్పుడే ప్రజలే సార్వభౌము లనే భావనకు అర్థం చేకూరుతుంది.

 వ్యాసకర్త : ఓబీసీ 

ఇంటలెక్చువల్ ఫోరమ్ కన్వీనర్, 9177566741

మరిన్ని వార్తలు