మత్తులో తెలంగాణ యువత!
శ్రీనివాస్ జీడిపల్లి :
హైదరాబాద్‌లో 2016లో వెలుగుచూసిన మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం(Illegal drug trade) తెలంగాణ సమాజానికి పెను సవాల్‌గా మారింది. బంగారు భవిష్యత్తును నిర్మించాల్సిన యువత మత్తు పదార్థాల మాయలో చిక్కుకుంటుంటే, ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు, విద్యాసంస్థలు(Governments, police systems, and educational institutions), తల్లిదండ్రులు తమ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాయి? పుస్తకాలు చేతబట్టి విజ్ఞాన శిఖరాలను అధిరోహించాల్సిన యువత చేతుల్లో మత్తు పదార్థాలు(Intoxicating substances) కనిపిస్తున్నాయనే వార్తలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి.
కలలు కనాల్సిన వయసులో మత్తుకు బానిసలవుతున్న యువతరం, కుటుంబాల కన్నీళ్లు, తల్లిదండ్రుల ఆవేదన, పెరుగుతున్న నేరప్రవృత్తి మన ముందున్న చేదు వాస్తవాలు. ఇది కేవలం మాదకద్రవ్యాల సమస్య కాదు. ఒక తరం భవిష్యత్తును, రాష్ట్ర సామాజిక ఆరోగ్యాన్ని, దేశ ప్రజాస్వామిక పునాదులను సవాల్ చేస్తున్న ప్రమాదకర పరిణామం. తెలంగాణలో మాదకద్రవ్యాల సమస్య నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదు.
2016 నుంచే హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఆందోళనకరమైన పరిణామాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ నగరంలో 2015లో 27 ఎన్డీపీఎస్ కేసులు నమోదు కాగా, 2016లో 77 కేసులు నమోదయ్యాయి. 2017 నాటికి ఆ సంఖ్య 94కు చేరింది. 2017లో సినీ పరిశ్రమలోని ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు రావడంతో మాదకద్రవ్యాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తం గా సంచలనం సృష్టించింది.
గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్డీ వంటి మత్తు పదార్థాలతో పాటు వైద్య అవసరాలకు వినియోగించే కొన్ని అలవాటు కలిగించే ఔషధాల దుర్వినియోగం కూడా ఆందోళన కలిగిస్తోంది. రహస్య రవాణా మార్గాలు, మధ్యవర్తులు, స్థానిక విక్రేత లు, ఆర్థిక లావాదేవీలు, అంతర్రాష్ట్ర సంబంధాలు ఈ అక్రమ వ్యాపారాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ వ్యాపారంలో యువత బలహీనతను పెట్టుబడిగా మార్చుకుని కోట్లు సంపాదిస్తున్న అక్రమ వ్యాపారులే.
గణాంకాలే సాక్ష్యం
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీసు శాఖ గణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 2,169 ఎన్డీపీఎస్ కేసుల్లో 5,205 మంది అనుమానితులను అరెస్టు చేసి, రూ.148.09 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు ఎక్సైజ్ శాఖ 2024లో 1,045 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 1,840 మందిని అరెస్టు చేసింది. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం ఎన్డీపీఎస్ కేసులు 2023లో 1,487 ఉండగా, 2024 లో 2,183కు పెరిగాయి.
హైదరాబాద్‌లో కూడా కేసుల సంఖ్య 2023లో 259 నమోదు కాగా 2024లో 347కు పెరిగాయి. యువత మత్తుకు బానిసవడం వెనుక స్నేహితుల ఒత్తిడి, చెడు సాంగత్యం, కుటుంబాల్లో సంభాషణ లోపం, నిరుద్యోగం, నిరాశ, మానసిక ఒత్తిడి వంటి సామాజిక కారణాలున్నాయి. ప్రభుత్వాల ప్రకటనలు, హడావుడి తనిఖీలతో మాదకద్రవ్యాల సమస్యకు పరిష్కారం లభించదు. అక్రమ రవాణా వెనుక ఉన్న ఆర్థిక మూలాలు, అంతర్రాష్ట్ర ముఠాలు, ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
విద్యాసంస్థలు విద్యార్థుల్లో నైతిక విలువలు, మానసిక ధైర్యం పెంపొందిస్తూ మత్తు నిరోధక అవగాహన, కౌన్సెలింగ్ ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగు తూ వారి మానసిక స్థితి, ప్రవర్తనలో మార్పులను గమనించి సరైన మార్గనిర్దేశం చేయాలి.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఈగిల్ ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాలను బలోపేతం చేసి, డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లపై నిఘా, కఠిన చర్యలు చేపట్టాలి.
రచయిత, తూప్రాన్,
మెదక్ జిల్లా
సెల్: (9014443134)