రైతుల్లో ‘రైతు డిస్కం’ గుబులు!

15-10-2026 | 05:05am

డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ :

తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో(Impact of El Nino) కరువు పరిస్థితులు తాండవిస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘రైతు డిస్కం’ను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త విద్యుత్ పంపిణీ వ్యవస్థ(Electricity distribution system) రైతులకు ఎంతవరకు మేలు చేస్తుంది? వ్యవసాయ రంగంపై(Agricultural Sector) ఎలాంటి ప్రభావం చూ పుతుంది? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మది లో మెదులుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రైతులు(Farmers) ఇ బ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే పంటలు చేతికొచ్చే పరిస్థితి లేకపోగా, నీళ్లున్న రైతులు(Farmers)  

కరెంట్ కొరతతో అవస్థలు పడుతున్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యు త్ పంపిణీ సంస్థలను విభజించి, కొత్తగా ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేస్తూ జీవో 17 జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, నాణ్యమైన 24 గంటల ఉచిత వి ద్యుత్ అందించడానికే ‘రైతు డిస్కం(Farmer DISCOM)’ తెస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

కానీ రైతాంగంతో పాటు విద్యుత్, ఉద్యోగ సంఘాలు(Employee Associations), విపక్షాల్లో మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా నడుస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం రక్షణగా నిలుస్తుందా? లేదా మంగళం పా డే దిశగా అడుగులు పడనున్నాయా అన్న సందేహాలకు తెరలేచింది.

జీవో 17 ప్రకారం రూపుదిద్దుకున్న నూతన పంపిణీ వ్యవస్థ గణాంకాలను పరిశీలిస్తే విద్యుత్ విభాగంలో ఇదొక భారీ మార్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,63, 793 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు నూతన డిస్కం పరిధిలోకి బదిలీ అయ్యాయి. అం తేకాకుండా వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థకు సంబంధించిన దాదాపు రూ.46,155 కోట్ల విలువైన ఆస్తులు (సబ్‌స్టేషన్లు, హెచ్‌టీ,ఎల్‌టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మ ర్లు) ‘రైతు డిస్కం’ పరిధిలోకి వచ్చాయి.

అయితే, ఈ భారీ వ్యవస్థను నడిపించేందుకు కేవలం 2,000 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించడం ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ విద్యుత్ రంగం లో (ట్రాన్స్‌కో, జెన్‌కో, రెండు పాత డిస్కంలలో) 45,000 నుంచి 50,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. అంతటి విస్తృతమైన నెట్‌వర్క్, 30 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ కనెక్షన్ల నిర్వహణ బాధ్యతలను కేవలం 2,000 మందికి అప్పగించడం వల్ల క్షేత్రస్థాయి సేవలపై తీవ్ర ప్రభావం పడుతుందనడం లో సందేహం లేదు.

ఇప్పటి వరకు రాష్ర్టంలో ఉమ్మడిగా పనిచేస్తున్న టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ వంటి డిస్కంల పరిధిలో గృహ, పారిశ్రామిక, వాణిజ్య మరియు వ్య వసాయ రంగాలు కలిసి ఉండేవి. అందువల్ల, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదా రుల నుంచి వచ్చే ఎక్కువ రాబడితో వ్యవసాయ రంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్ లో టును సర్దుబాటు చేసే క్రాస్ సబ్సిడీ  విధానం డిస్కంలకు ఆర్థికంగా పెద్ద ఊరటగా ఉండేది.

కానీ, ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా వేరుచేసి కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావడంతో, ఈ నూతన ‘రైతు డిస్కం’కు సొంత రాబడి  ఉండదు. ఇది పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కేటాయింపులు, సబ్సిడీ గ్రాంట్లపైనే ఆధారప డాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో సబ్సిడీ నిధు లు విడుదల చేయకపోతే, నూతన డిస్కం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, నిర్వాహణ భారం మోయలేక చేతులెత్తేసే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం ఉన్న ఏకీకృత డిస్కంల వ్యవస్థలోనే గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మ ర్లు కాలిపోతే కొత్తవి అమర్చడానికి లేదా విద్యుత్ లైన్ల సాంకేతిక లోపాలు సరిదిద్దడానికి రోజుల తరబడి సమయం పడు తోంది. నూతన డిస్కంలో కేవలం 2,000 మంది సిబ్బంది మాత్రమే ఉండటంతో, వే లాది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వ్యవసాయ విద్యుత్ లైన్లను నిరంతరం పర్యవేక్షించడం అసాధ్యంగా మారుతుంది. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినప్పుడు లేదా పంట పొలాల్లో లైన్లు తెగిపడినప్పుడు వెం టనే స్పందించే లైన్‌మన్ల కొరత తీవ్రమవుతుంది. లైన్‌మన్లు సరిపడా అందుబాటు లో లేకపోతే పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోవడానికి దారితీస్తుందనే భ యం రైతుల్లో నెలకొంది.   

మరో వైపు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన (ఆర్‌డీఎస్‌ఎస్) సంస్కరణల్లో భాగం గా డిస్కంల ఆర్థిక స్థిరత్వం, విద్యుత్ వినియోగంలో పారదర్శకత ప్రధాన షరతులు గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసా య బావుల వద్ద రైతులకు నేరుగా స్మార్ట్ మీటర్లు బిగించబోమని స్పష్టం చేస్తున్నప్పటికీ, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్, ఫీడర్ స్థాయిలో స్మార్ట్, డిజిటల్ మీటర్లు ఏర్పా టు చేసే ప్రక్రియ వేగవంతమవుతోంది.

దీనివల్ల ప్రతి వ్యవసాయ ఫీడర్ నుంచి ఎంత విద్యుత్ వినియోగమవుతుందో కచ్చితమైన వివరాలు నమోదవుతాయి. సొంత రాబడి లేని ‘రైతు డిస్కం’కు ప్రభు త్వ బడ్జెట్ ద్వారా ఉచిత విద్యుత్ సబ్సిడీని సకాలంలో అందించలేకపోతే, సదరు ఫీడర్ మీటర్ల డేటాను ప్రామాణికంగా తీసుకుని, ఉచిత విద్యుత్ వినియోగంపై పరిమితులు (కోతలు) విధించే అవకాశం లేకపోలేదు.

లేదా భవిష్యత్తులో క్రమంగా ఉచిత విద్యుత్ విధానానికి స్వస్తి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందేమోనని విద్యుత్ నిపు ణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అం దించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సొంత రాబడి లేకపోవడం, సిబ్బం ది కొరత, కేంద్ర సంస్కరణల ఒత్తిడి వంటి అంశాలతో ‘రైతు డిస్కం’ భవిష్యత్తుపై నల్లమబ్బులు కమ్ముకున్నాయి. 

ఉచిత కరెంట్ పథకం నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణ మే కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి.‘రైతు డిస్కం’కు అవసరమైనంత క్షేత్రస్థాయి ఇంజనీర్లు, లైన్‌మన్లను కేటాయించి సేవల నాణ్యతను పెంచాలి. సకాలంలో బడ్జెట్ కేటాయించి ‘రైతు డిస్కం’కు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేయాలి. స్మార్ట్ మీటర్ల నెపంతో ఉచిత విద్యుత్‌కు ఎలాం టి విఘాతం కలగదని, కోతలు విధించబోమని రైతాంగానికి భరోసా ఇవ్వాలి. అప్పుడే నూతన డిస్కం ఏర్పాటు పట్ల రైతుల్లో అనుమానాలు తొలగిపోతాయి.

 డాక్టర్  శ్రీనివాస్ 

తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం

(టాస్క్) అధ్యక్షుడు

మరిన్ని వార్తలు