ఆకలెరుగని ఆయుధాలు!

21-11-2026 | 05:10am

ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగం(The world of science and technology)లో దూసుకెళ్తోంది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తున్నది. కృత్రిమ మేధస్సుతో కొత్త ఆవిష్కరణలు చేస్తోంది. సముద్ర గర్భంలోని రహస్యాలను ఛేదిస్తోంది. వ్యాధులకు చికిత్సలు కనుక్కుంటోంది. ఇందుకు వేల, లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. దేశ రక్షణ పేరిట క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, అణ్యాయుధాల తయారీకి, కొనుగోళ్లకు కోట్లకు కోట్లే ఖర్చు పెడుతున్నది.

కానీ, ఇదే ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మందికి కడుపునిండా భోజనం అందించలేకపోతోంది. యుద్ధం చేయగల శక్తి ఉన్న ప్రపంచానికి ఆకలిని నిర్మూలించే శక్తి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయుధాల తయారీకి అపార మైన సంపదను సమీకరించగల దేశాలు పేదల కడుపు నింపడానికి అవసరమైన నిధులను సమకూర్చకపోవడం ప్రపంచ దేశాల ఆర్థిక ప్రాధాన్యతలను, పాలకుల బాధ్యతలను, మానవ సమాజం అనుసరిస్తున్న అభివృద్ధిని పునఃపరిశీలించాల్సిన సందర్భోచితాలు.

ఆయుధ వ్యయమెక్కువ..

అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(International Peace Research Institute) గణాంకాల ప్రకారం, 2024లో ప్రపంచ సైనిక వ్యయం సుమారు 2.718 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. గతంతో పోలిస్తే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈ వ్యయం 9.4 శాతం పెరిగి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 2.5 శాతం సైనిక అవసరాలకు ఖర్చయింది. దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ముప్పులు, భౌగోళిక రాజకీయ పోటీలు, ఆధిపత్య ధోరణులు ఆయుధ వ్యయాన్ని పెంచుతున్నాయి.

ఓ దేశం కొత్త ఆయుధాన్ని కొను గోలు చేస్తే, దాని ప్రత్యర్థి దానికంటే శక్తివంతమైన ఆయుధాన్ని సమకూర్చుకోనే ప్రయత్నంలో సైనిక బడ్జెట్ పెంచుకుంటూ భద్రత పేరుతో మొదలైన పోటీ అంతులేని ఆయుధ పోటీగా మారుతోంది. ప్రతి రక్ష ణ వ్యయాన్నీ అనవసరమైనదిగా చూడ లేం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం, సరిహద్దులను రక్షించడం, ప్రజలను ఉగ్రవాదం నుంచి సంరక్షించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతలు. సైనికుల భద్రత, ఆధునిక రక్షణ సామర్థ్యం, అత్యవసర పరిస్థితులకు సన్నద్ధత కూడా అవసరమే. కానీ రక్షణ పేరుతో ఎంత ఖర్చు ఎంత చేయా లి? ఎంత పారదర్శకత ఉండాలి, ప్రజల 

ప్రాథమిక అవసరాలకు నిధుల కొరత ఏర్పడుతోందా అనే ఆలోచన కావాలి. దేశ భద్రత అంటే  సరిహద్దుల్లో శత్రువును ఎదుర్కొనే శక్తే  కాదు, దేశంలో పౌష్టికాహారం లభించని చిన్నారులు, వైద్యం అందని పేదలు, చదువులు లేని పిల్లలు, ఉపాధి లేక అల్లాడుతున్న యువత ఉంటే ఆ దేశ భద్రత సంపూర్ణమైనది కాదు. ఆకలితో బలహీనపడిన సమాజానికి ఆయుధ సంపత్తి బలాన్ని ఇవ్వదు.

ఆకలి భవిష్యత్ తరాలకు దెబ్బ..

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, 2025లో ప్రపంచ జనాభాలో ప్రతి13 మందిలో ఒకరు తగినంత ఆహారం పొం దలేని స్థితిలో ఉన్నారు. ఆకలి అంటే ఆహారం తినకపోవడమే కాదు. తగినంత ఆహారం లేక శరీర బలహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గడం, గర్భిణుల్లో పోషకాహార లోపాలు, విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినడం, కుటుంబాల ఆదాయంలో అధిక భాగం ఆహారానికే ఖర్చవడం లాం టి సమస్యల సమాహారం. పిల్లలకు సరైన పోషకాహారం అందకపోతే వారి శారీరక ఎదుగుదలతోపాటు మేధో వికాసం కూడా ప్రభావితమై పోషకాహార లోపంతో పెరిగిన తరానికి నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన జీవితం అందించడం కష్టం. ఆకలి ప్రస్తుత జీవితాన్నే కాదు భవిష్యత్తు తరాల సామర్థ్యాన్నీ దెబ్బతీస్తుంది.

ఆకలి కారణాలు..

ప్రపంచంలో ఆహార ఉత్పత్తి ఉన్నా ఆకలి కొనసాగడానికి పేదరికం, వాతావరణ మార్పులు, కరువులు, వరదలు, ఆహార ధరల పెరుగుదల, అసమానతలు, వ్యవసాయ వనరుల కొరత, ఆహార పంపిణీలో లోపాలు, రాజకీయ అస్థిరత ప్రధాన కారణాలు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం అందుబాటులో ఉన్నా కొనుగోలుకు ఆర్థిక శక్తి లేదు.

మరికొన్ని ప్రాంతాల్లో యుద్ధాల కారణంగా పంటలు పండించే భూములు నాశనం, రవాణా మార్గాలు మూసుకుపోవడం, సహాయ సామగ్రి ప్రజలకు చేరదు. అందుకే ఆకలి నిర్మూలనకు ఆహారాన్ని ఉత్పత్తి చేయడమే కాదు, అవసరమైన వారికి అందించడం, కొనుగోలు శక్తిని, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, పోషకాహారాన్ని ప్రజల హక్కుగా గుర్తించి అమలు చేయడం అవసరం.

ఆయుధాల ఖర్చులో కొంతైనా..

ప్రపంచ సైనిక వ్యయాన్ని నిలిపివేయడం పరిష్కారం కాదు. అవసరమైన రక్షణకు, అతిగా ఆయుధాలు సమకూర్చుకునే పోటీకి మధ్య స్పష్టమైన గీత గీయాలి. సైనిక వ్యయంలో కొంత భాగాన్ని సమర్థవంతంగా ఆదా చేసి దేశాల మధ్య విశ్వా సాన్ని పెంచి ఆయుధ పోటీని తగ్గించి ఆదా అయిన వనరులను ఆకలి నిర్మూలన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలకు మళ్లించాలి. ప్రపంచ సైనిక వ్యయం 2.718 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నప్పుడు, అందులో ఒక శాతం అంటే సుమారు 271.8 బిలియన్ డాలర్లు, ఈ మొత్తాన్ని మానవ అభివృద్ధి వైపు మళ్లించే అవకాశాన్ని ప్రపంచం పరిశీలనలోకి తీసుకోవాలి. మానవ ప్రాణాలను రక్షించడా నికి ఖర్చు చేసే ప్రతి రూపాయి,భవిష్యత్తు లో అనారోగ్యం, పేదరికం, సామాజిక అస్థిరత వల్ల ఏర్పడే భారాన్ని తగ్గించగలదు.

మన దేశ బాధ్యత

భారతదేశం వ్యవసాయ ప్రధానదేశమై ఆహార ఉత్పత్తిలో ముందున్నా ప్రతి కు టుంబానికీ సమతుల్య పోషకాహారం అం దడంపై ఇంకా స్పష్టత రావాలి. ఆహార ధాన్యాల దిగుబడి పెరగడంతో పాటు పోషకాహార లోపం, చిన్నారుల ఎదుగుదల లోపాలు, రక్తహీనత వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ పారదర్శకత, నాణ్యత, అర్హులందరికీ చేరువ కావడం, స్థానిక ఆహార వైవిధ్యం మెరుగుపడాలి.

అర్హులు మిగిలిపోకుండా చూడటం,ధాన్యం పాడవకుండా శాస్త్రీయ నిల్వ పద్ధతులు పాటించ డం, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నా ణ్యమైన పోషకాహారాన్ని సకాలంలో అం దించడం అవసరం. రైతుకు సరైన ధర దక్కక, వినియోగదారుడికి అధిక ధర మారితే ఆహార వ్యవస్థలో లోపం ఉన్నట్లే. ఆకలి నిర్మూలన నిధుల వినియోగం, పొం దిన లబ్ధి, పోషకాహార లోపం తగ్గింపుపై ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంటూ ప్రజలకు పారదర్శక సమాచారం అందించాలి.

ఆకలి తీర్చే మార్గాలు

ఆకలి తీర్చడానికి ప్రకటనలు, హామీలు కాదు స్పష్టమైన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన నిధుల వినియోగం అవసరం. ఆహారం పొందడం ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. ఏ ఒక్కరూ ఆకలితో అలమ టించకూడదు. పేదరికం, విపత్తులు, యు ద్ధాల సమయంలో అత్యవసర ఆహార వ్యవస్థలు బలంగా ఉండాలి. వ్యయాన్ని తగ్గించి, ఆ వనరులను ప్రజా సంక్షేమానికి మళ్లించాలి. ధనిక దేశాలు పేద దేశాలకు సాంకేతిక,ఆర్థిక సహాయం అందిస్తూ అం తర్జాతీయ సహకారాన్ని పెంచాలి.

శాంతి.. బలహీనత కాదు

ప్రపంచ దేశాలు శాంతి గురించి మాట్లాడుతూ ఆయుధ పోటీకి బానిసలైతే ఆ శాంతి ప్రకటనలకు అర్థమే లేదు. దేశా ల మధ్య సమస్యలు రావడం సహజం. ప్రతి సమస్యకూ యుద్ధమే పరిష్కారం కాదు. దౌత్య చర్చలు, పరస్పర విశ్వాసం, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, వాణిజ్య సహకారం, సాంస్కృతిక సంబంధాలు ఉద్రిక్తతలను తగ్గించగలవు. శాంతి కోసం చేసే ప్రయత్నాన్ని బలహీనతగా కాక యు ద్ధాన్ని నివారించే గొప్ప విజయంగా భావించాలి.

యుద్దాన్ని అడ్డుకోవడం ద్వారా కాపాడే ప్రాణాలు, ఆదా చేసిన సంపద, నిలిచిన కట్టడాలు,సాగిన వ్యవసాయం మనం సాధించిన విజయాలే. ప్రపంచ నాయకులు సైనిక శక్తిని ప్రదర్శించే ఉత్సాహంతో ఆకలి నిర్మూలనలోనూ పోటీ పడాలి. ఏ దేశం అత్యాధునిక ఆయుధాన్ని తయారు చేసిందన్నది కాదు. ఏ దేశం తన ప్రజల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి ఎందరిని పిల్లలను ఆకలి నుంచి రక్షించింది, ఎన్ని కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించిందనేవి దేశ విజయానికి కొలమానాలుగా మారాలి.

మానవత్వ బాధ్యత

ప్రపంచంలో తగినంత ఆహారోత్పత్తి, సాంకేతికత, నిల్వ పరిజ్ఞానం మరియు అంతర్జాతీయ వేదికలు ఉన్నప్పటికీ ఆకలి కొనసాగుతోందంటే, సమస్య వనరుల కొరతలో కాదు.. వాటి పంపిణీ, వినియో గం, ప్రాధాన్యతల్లో ఉంది. దేశాలు తమ సరిహద్దులను ఎంతగా కాపాడుకోవాలో, ప్రజలను ఆకలి నుంచి రక్షించడానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకలితో ఉన్న చిన్నారికి సరిహద్దు వివాదాలు అర్థం కావు. అన్నం కోసం చూసే తల్లికి క్షిపణులతో, ఉపాధి కోల్పోయిన రైతుకు యుద్ధ విమానాలతో పనిలేదు. వారికి కావలసింది ఆహారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి  గౌరవప్రదమైన జీవితం. యుద్ధాలు నాగరికతల కు అంతాన్నే మిగులుస్తాయి తప్ప విజయాన్ని ఇవ్వవు.

ఆయుధాలు కేవలం రక్షణ నివ్వగలవు, కానీ భవిష్యత్తును నిర్మించలేవు. శత్రువును భయపెట్టే ఆయుధాల కంటే ఆకలిని జయించే అన్నమే మానవాళికి నిజమైన బలం. శాంతి అంటే యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ ఆహారం, వైద్యం, విద్య, ఉపాధి అందడమే అసలైన శాంతి. ప్రపంచ సంపదను ఆయుధాల పోటీ నుంచి మానవా భివృద్ధికి మళ్లిస్తే కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చు. అన్నం అందించడం ధాతృత్వం కాదు, అది మన నాగరికతకు పరీక్ష, మానవత్వపు కనీస బాధ్యత. దేశాల గొప్పతనం ఆయుధాగారాల్లో లేదు, పేదరికం లేని సమాజ నిర్మా ణంలో ఉంది. ఆకలిని నిర్మూలించి, ప్రతి మనిషికి గౌరవప్రదమైన జీవితాన్ని అం దించినప్పుడే మానవత్వానికి నిజమైన విజయం లభిస్తుంది.

వ్యాసకర్త సెల్: 8466827118

దుప్పటి మొగిలి

మరిన్ని వార్తలు