అమెరికన్ల తీర్పు భారత్‌కు పరీక్ష

08-11-2026 | 05:05am

తిప్పర్తి శ్రీనివాస్ :

ప్రపంచ రాజకీయాల్లో అమెరికా(America) పాత్ర అత్యంత కీలకమైనది. అగ్రరాజ్యంగా(Superpower) కొనసాగుతున్న అమెరికాలో చోటుచేసుకునే రాజకీయ పరిణా మాలు ఆ దేశ సరిహద్దులకే పరిమితం కావు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం, దౌత్య సంబంధాలు, భద్రతా విధానాలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 3న ఆ దేశంలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు(Midterm election results) ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నాయ కత్వంలోని రిపబ్లికన్ పార్టీకి(Republican Party) ఎదురుదెబ్బ తగలడం, డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లోనూ ఆధిక్యం సాధించడం అమెరికా రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది.

ఈ పరిణామం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాలుగా మారడమే కాకుండా భారత్ సహా పలు దేశాల ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశముంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీకాలంలో రెండేళ్లు పూర్తయిన తర్వాత జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్లోని 100 స్థానాల్లో కొన్నింటికి ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికలు కాకపోయినా, కాంగ్రెస్‌లో ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుందన్నది ప్రభుత్వ విధానాల అమలును ప్రభావితం చేస్తుంది.

ట్రంప్‌కు ప్రతిఘటన తప్పదు!

తాజాగా రెండు సభల్లోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించినప్పటికీ, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు 2027 జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటి వరకు ప్రస్తుత కాంగ్రెస్ యధాతథంగా కొనసాగుతుంది. కొత్త సభ్యులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో మరింత రాజకీయ ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానా లపై విచారణలు, బడ్జెట్ ఆమోదం, నిధుల కేటాయింపులు, చట్టాల రూపకల్పనలో డెమోక్రాట్ల పాత్ర పెరుగుతుంది. అయితే దీనివల్ల ట్రంప్ అధ్యక్ష పదవికి ముప్పు ఏర్పడినట్లు కాదు. విదేశాంగ, వాణిజ్య, వలస విధానాల్లో అధ్యక్షుడికి ఉన్న కార్యనిర్వాహక అధికారాలు కొనసాగుతాయి. 

భారత వాణిజ్య రంగంపై..

ఈ ఎన్నికల ప్రభావం భారత్‌పై ప్రధానంగా వాణిజ్య రంగంలో కనిపించే అవకా శం ఉంది. అమెరికా భారత్‌కు అత్యంత ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లలో ఒకటి. వస్త్ర పరిశ్రమ, ఔషధ తయారీ, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, సమాచార సాంకేతిక సేవలు వంటి రంగా లు అమెరికా మార్కెట్‌తో బలమైన సం బంధాలు కలిగి ఉంది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న సుంకాల విధానం భారతీయ ఎగుమతిదారుల్లో అనిశ్చితిని పెం చింది. కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం ఏర్పడటంతో వాణిజ్య సుంకాల విధానంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం పెరుగుతుంది. ఏకపక్షంగా సుంకాలు విధించే అధికారాలపై చట్టసభల పర్యవేక్షణ పెరిగితే భారత్‌కు కొంత ఊరట లభించవచ్చు. 

అయితే ఎన్నికల ఫలితాల కారణంగా అమెరికా వాణిజ్య విధానం పూర్తిగా మారిపోతుందని ఆశించడం తొందరపాటే. భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే చర్చలు కొనసాగించాలి.

వీసాలపై ఆంక్షలు తొలగేనా?

భారతీయ యువతకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు అమెరికా ఎన్నికలు మరో కీలక అంశాన్ని ముందుకు తెచ్చాయి. హెచ్-1బీ వీసాల ద్వారా వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి సాంకేతిక రంగ అభివృద్ధిలో భారతీయుల పాత్ర గణనీయమైనది. అయితే ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో కఠిన వైఖరి అనుసరిస్తోంది. వీసా రుసుములు, అర్హత నిబంధనలు, దరఖాస్తుల పరిశీలనలో మార్పులు భారతీయ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

కొత్త కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో వలస విధానాలపై చర్చలు, పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. భారతీయ నిపుణుల ప్రయోజనాలకు సంబంధించిన అం శాలు ప్రాధాన్యం పొందవచ్చు. అయితే వీసా నిబంధనల్లో తక్షణ మార్పులు వస్తాయని భావించలేం. అమెరికా ఉద్యోగ మార్కెట్ అవసరాలు, దేశీయ ఉపాధి, రాజకీయ ప్రయోజనాలు ఈ విధానాలను ప్రభావితం చేస్తాయి.

ఆర్థిక మార్కెట్లపై పరోక్షంగా..

అమెరికా రాజకీయ పరిణామాలు భారత ఆర్థిక మార్కెట్లపైనా పరోక్ష ప్రభా వం చూపుతాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అమెరికా ఆర్థిక విధానాలను నిశితంగా పరిశీలిస్తుంటారు. కాంగ్రెస్లో అధికార సమీకరణాలు మారడంతో పన్ను లు, ప్రభుత్వ వ్యయం, వాణిజ్యం, ఆర్థిక విధానాలకు సంబంధించిన చర్చల్లో అనిశ్చితి ఏర్పడవచ్చు. దీనివల్ల అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహంలో హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉంది.

విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్లలో కీలక పాత్ర పోషిస్తున్నందున అమెరికా మార్కెట్లలో వచ్చే మార్పులు మన మార్కెట్లను కూడా ప్రభావితం చేయవచ్చు. డాలర్ విలువ, రూపాయి మారకం రేటు, ముడిచమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి అమెరికా ఎన్నికల ప్రభావాన్ని కేవలం స్టాక్ మార్కె ట్ కోణంలోనే కాకుండా విస్తృత ఆర్థిక దృక్పథంతో పరిశీలించాలి.

ఇంధన రంగం కూడా భారత్కు అత్యం త కీలకమైనది. దేశీయ అవసరాల కోసం భారత్ గణనీయమైన స్థాయిలో ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఇరాన్తో అనుసరిస్తున్న విధానం, మధ్యప్రాచ్యంలో నెలకొనే ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు ధరలను ప్రభావితం చేస్తాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు లేదా అదనపు సుంకాలు విధించే విషయంలో అమెరికా తీసుకునే నిర్ణయాలు కూడా భారత ప్రయోజనాలకు సంబంధించినవే.

కాంగ్రెస్లో డెమొక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో ట్రంప్ విదేశాంగ విధానంపై చర్చలు, పర్యవేక్షణ పెరగవచ్చు. ముఖ్యం గా యుద్ధ వ్యయం, అంతర్జాతీయ సంబంధాలు, ఆంక్షల విధానాలపై చట్టసభల్లో చర్చలు ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. అయినప్పటికీ రష్యా, ఇరాన్ల విషయంలో అమెరికా వైఖరి మారుతుందని ఇప్పుడే నిర్ధారించలేం.

రక్షణ, వ్యూహాత్మక సంబంధాల విషయంలోనూ ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలను పరిరక్షించడం వంటి అంశాల్లో భారత్, అమెరికా పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. రక్షణ పరికరాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉమ్మడి సైనిక విన్యాసాలు ఈ సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి.

కాంగ్రెస్లో ఆధిక్యం మారడం వల్ల రక్షణ ఒప్పందాలు, నిధుల కేటాయింపులు, సాంకేతిక సహకారానికి సంబంధిం చిన చర్చల్లో మార్పులు రావచ్చు. అయితే భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల్లోనూ మద్దతు ఉండటం మనకు సానుకూల అంశం. ఈ పరిణామాల మధ్య భారత్ అనుసరించాల్సిన దౌత్య వ్యూహం అత్యం త కీలకం. ఒక పార్టీతోనే సంబంధాలను పరిమితం చేయకుండా అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలను కొనసాగించాలి.

అధ్యక్షుడితోపాటు కాంగ్రెస్ సభ్యులు, పరిశ్ర మల ప్రతినిధులు, సాంకేతిక సంస్థలు, ప్రవాస భారతీయులతో సంబంధాలను బలోపేతం చేయాలి. అమెరికాలోని భారతీయ సమాజం రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తోంది. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యాన్ని కూడా భారత్ తన దౌత్య సంబంధాల్లో సమర్థంగా వినియోగించుకోవాలి.

అమెరికాపై ఆధారపడొద్దు!

మరోవైపు అమెరికాపై ఆర్థికంగా ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా భారత్ చర్యలు చేపట్టాలి. యూరప్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించాలి. దేశీ య తయారీ రంగాన్ని బలోపేతం చేయ డం, ఎగుమతుల నాణ్యతను పెంచడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం ద్వారా అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ, ఔషధా లు, ఎలక్ట్రానిక్స్, రక్షణ ఉత్పత్తుల రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు భారత్కు కొన్ని అవకాశా లను కల్పిస్తూనే కొత్త సవాళ్లను కూడా ముందుకు తెచ్చాయి. ట్రంప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పర్యవేక్షణ పెరగడం వల్ల ఏకపక్ష నిర్ణయాలపై కొంత నియంత్రణ ఏర్పడవచ్చు. అదే సమయంలో రెండు పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు పెరిగితే కీలక విధాన నిర్ణయాల్లో జాప్యం జరిగే ప్రమా దం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలను భారత్‌కు పూర్తిస్థాయి విజయంగా లేదా నష్టంగా చూడటం సరికాదు.

అమెరికా అంతర్గత రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేయడ మే అవసరం. అగ్రరాజ్యంలో మారే రాజకీయ సమీకరణాల మధ్య భారత విదే శాంగ విధానం స్వతంత్రంగా, సమతుల్యం గా కొనసాగాలి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చు కుంటూనే దేశ ఆర్థిక, దౌత్య ప్రయోజనాలను కాపాడుకోగలిగితేనే అమెరికా ఎన్ని కల ఫలితాలను భారత్ తనకు అనుకూలమైన అవకాశాలుగా మలుచుకోగలదు. 

 వ్యాసకర్త సెల్ : 99484 39565

మరిన్ని వార్తలు