చరిత్రకెక్కని భీమన్న గాథ!
భారతీయ చరిత్రలో మహాభారతం ఇతిహాసం మాత్రమే కాదు. తరతరాలుగా ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణి, విశ్వాసాలను ప్రభా వితం చేసిన మహాగాథ. పాండవుల పరాక్రమం, ధైర్యసాహసాలు భారతీయ జనజీవనంలో చెరగని ముద్రవేశాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ సమాజాల జానపద సంప్రదాయాల్లో మహాభారత పాత్రలు స్థానిక దేవతల ఆరాధనతో మమేకమయ్యాయి. అలాంటి ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వ సమాజమే నాయకపోడు ఆదివాసీ సమాజం. సమాజంలో కొనసాగుతున్న భీమన్న(Bhimanna) ఆరాధన, పాండవుల గాథలతో ముడిపడిన మౌఖిక సం ప్రదాయాలు, పూర్వీకుల కథనాలు ప్రత్యేక పరిశోధనకు అర్హమైనవి. వీటి చారిత్రక నేపథ్యాన్ని వెలికితీయడం నేటి తరానికి ఒక చారిత్రక బాధ్యత.
నాయకపోడుల ఆరాధ్యుడు భీమన్న
నాయకపోడు సమాజంలో భీమన్నకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా పెద్దలు చెప్పుకొస్తున్న కథనాల్లో భీమన్నను పాండవుల భీముడితో అనుసంధానించే విశ్వాసాలు కనిపిస్తాయి. భీమన్న ఆరాధన ఆ సమాజ ఐక్యతకు, పూర్వీకుల జ్ఞాపకాలకు ప్రతీకగా నిలుస్తోంది. పాండవుల వనవాసానికి సంబంధించిన కథనాలు నాయకపోడుల మౌఖిక సంప్రదా యాల్లోనూ కొనసాగుతున్నాయి. వీటిలో మహాభారత ప్రభావమెంత? స్థానిక చరిత్ర, పూర్వీకుల గాథల పాత్ర ఎంత? అన్నది చరిత్ర, జానపద సాహిత్యం, మానవ పరిశోధనల ద్వారా అధ్యయనం చేయాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న నిర్మల్ జిల్లా గాంధారి ప్రాంతానికి సంబంధించి పలు శాసనాల్లో కనిపించే ‘నాయక’ పదం పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే శాసనాల్లోని నాయకులకు నేటి నాయకపోడు సమాజానికి ప్రత్యక్ష వంశపారంపర్య సంబంధం ఉందని ఇప్పుడే నిర్ధారించలేం.
కానీ, నాయకపోడు ప్రజల ఉనికి, భీమన్న, గాంధారి మైసమ్మ వంటి ఆరాధనా సంప్రదాయా లు ఇక్కడ కొనసాగడం ఈ ప్రాంత సాంస్కృతిక ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయి. నాయకపోడు సమాజంలో కోర్రిరాజుల కథనాలు, భీమన్న ఆరాధన, లక్ష్మీదేవర ఉత్సవాలు, గోత్ర వ్యవస్థ, ప్రకతి ఆరాధన వంటి సంప్రదాయాలు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి. ఇవి కేవలం ఆచారాలే కావు. సమాజపు సామూహిక జ్ఞాపకాలు, పూర్వీకుల జీవన అనుభవాలు, తరతరాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలు. ఇవి కాలగర్భంలో కలిసిపోకముందే పురావస్తు శాఖ, చరిత్రకారులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
నాయకిడి భాషే సంస్కృతికి మూలం
నాయకపోడు సమాజానికి చెందిన నాయకిడి భాష కూడా వారి ప్రత్యేకతను చాటి చెబుతుంది. ఇందులో తెలుగు, గోండి, మరాఠీ తదితర భాషల ప్రభావం కనిపిస్తుందని పరిశీలనలు సూచిస్తున్నాయి. భాషలోని ప్రత్యేక పదాలు, సామెతలు, జానపద గేయాలు, పూజా సంప్రదాయాల్లోని పదజాలాన్ని పరిశోధకులు సేకరించి, సమగ్ర నిఘంటువు రూ పొందించి భావితరాలకు అందించాలి. నాయకపోడు సమాజానికి షెడ్యూల్డ్ తెగల జాబితాలో గుర్తింపు ఉంది.
అయినప్పటికీ వారి సమగ్ర చరిత్ర, వలసల నేపథ్యం, భాషా పరిణామం, ఆచార వ్యవహారాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. హైదరాబాద్ సంస్థాన కాలం నాటి రికార్డులు, పాత గెజిటీర్లు, గిరిజన అధ్యయన నివేదికలు, వివిధ రాష్ట్రాల్లోని సమాజాల చారిత్రక సమాచారాన్ని సమన్వయం చేయాలి. చంపానేర్ నుంచి దండకారణ్యం వరకు వలసలు జరిగాయనే మౌఖిక కథనాలను కూడా పరిశీలించాలి. చరిత్రను కాపాడుకుంటేనే అస్తిత్వం పదిలం.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్టు,
సెల్ నం: 9848559863
వెంకగారి భూమయ్య