గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలు
-హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి
హనుమకొండ, నవంబర్ 05 (విజయ క్రాంతి): జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల పెంపునకు ప్రతిపాదనలను ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లోజిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్ఐఆర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ, తదితర అంశాలపై ఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇప్పటి వరకు వచ్చిన వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఓటరుగా నమోదుకు పట్టభద్రులు చేసిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిశీలన, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు కోసం 61041 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
ఇంకా దరఖాస్తులు రానున్నాయని తెలిపారు. ఓటర్ల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాలను పెంచే విధంగా ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలను పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ, పరకాల ఈఆర్వోలు,ఆర్డీవోలు వెంకటేష్, డీఎస్. వెంకన్న, హనుమకొండ ఏఈఆర్వో,తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావు అమరేందర్ రెడ్డి, ఎండీ. నేహాల్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.