యాంటి బయాటిక్స్ ఎక్కువ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ మొంతు కుమార్ ఎం పటేల్
హనుమకొండ, నవంబర్ 17 (విజయ క్రాంతి): యాంటి బయాటిక్స్(Antibiotics) ఎక్కువ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగి ఇబ్బంది తప్పదని, ఫార్మసీ డిగ్రీ లేని వారు వీటి వాడకాన్ని పెంచారని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(Pharmacy Council of India) అధ్యక్షులు డాక్టర్ మొంతు కుమార్ ఎం పటేల్ అన్నారు.
ప్రపంచ ఫార్మసిస్ట్ డే- నేషనల్ ఫార్మసీ వీక్ 2026 ను పురస్కరించుకొని కాళోజి కళాక్షేత్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 40 ఫార్మసీ కళాశాల ద్వారా 4000 మందికి పైగా విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని ఫార్మసి ఉన్నతికి కృషి చేసినట్లు తెలిపారు.ఈ సదస్సు లోఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ మొంతు కుమార్ ఎం పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో త్వరలో ఫార్మసీ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు
ప్రకటించారు.ఇప్పటికే గుజరాత్ లో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వేలాదిమంది ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. భవిష్యత్తులో ఫార్మారంగానికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మసీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఫార్మాసిటీని నెలకొల్పారన్నారు.
రాబోయే రోజుల్లో అనేక నూతన సంస్థలు ఈ రంగంలో ప్రవేశించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనన్నారు. మాజీ ఎంపీ, కూడా చైర్మన్ సుధారాణి మాట్లాడుతూ వైద్యరంగం తో దీటుగా ఫార్మసీరంగం అభివృద్ధి చెందడం ద్వారా అనేక నూతన ఔషధాలు తయారీకి అవకాశం కలుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించారు.
విశ్వంభరా ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో నిర్వహించిన ఈ ర్యాలీ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లు సాగింది. ఈ సమావేశంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యులు డాక్టర్ సలీముల్లా ఖాన్, స్టేట్ కో కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, స్టేట్ కన్వీనర్ డాక్టర్ ఎం వెంకటరమణ, విశ్వంభరా ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు సిహెచ్ దేవేందర్ రెడ్డి, సీఈవో సిహెచ్ విశ్వంభర రెడ్డి, తెలంగాణ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీధర్, నరసింహారెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.