కాంగ్రెస్ మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లో వేయాల్సిన పరిస్థితి
* 1,071 రోజులైనా అమలుకాని ఎన్నికల హామీలు
* ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి
* మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
గజ్వేల్, నవంబర్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,071 రోజులైనా ఎన్నికల హామీలు అమలు చేయలేదని, కాంగ్రెస్ మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లో వేయాల్సిన పరిస్థితి వచ్చిందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు(MP Raghunandan Rao) విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో కలిసి సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. ప్రజ్ఞాపూర్ నూతన బస్టాండ్‌ను పరిశీలించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఆరు నెలలుగా తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న సమస్యల్లో ఒక్కటైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా వచ్చే మార్చి వరకు తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. సింగూర్‌లో అందుబాటులో ఉన్న మూడు టీఎంసీల నీటిని కాపాడుకోవాలని, మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకే తాగునీరు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
కొడంగల్ అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ధను సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల అభివృద్ధిపై కూడా చూపించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మేనిఫెస్టో గురించి మాట్లాడటం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్, పార్టీ నాయకులు వ్యాపారులు పాల్గొన్నారు.