మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు,
ప్రభుత్వ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల, అక్టోబర్ 28 ( విజయ క్రాంతి ): జగిత్యాల మున్సిపల్(Jagtial Municipal) పరిధిలోని చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్, నీటిపారుదల (ఇరిగేషన్) శాఖల అధికారులతో కలిసి చింతకుంట చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరువు ప్రస్తుత పరిస్థితి, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సంబంధిత అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెరువు పరిరక్షణకు అవసరమైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి, చెరువు స్థలాన్ని కాపాడేందుకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం నూతనంగా నిర్మించనున్న కోర్టు భవనాల సముదాయానికి కేటాయించిన స్థలాన్ని, అలాగే ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించిన భూమిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయా స్థలాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని, నిర్మాణ పనులకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.
తదుపరి మున్సిపల్ పరిధిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించి, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనుల అమలులో జాప్యం లేకుండా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌తో పాటు మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.