జగిత్యాలలో 13,913 మందికి పింఛన్ పత్రాల పంపిణీ

15-11-2026 | 06:40pm

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మిగిలిన అర్హుల దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

జగిత్యాల, నవంబర్ 15 ( విజయక్రాంతి ) : ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత(Social Security) కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను(welfare schemes) అమలు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Lakshman Kumar) అన్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో(Jagtial District) వివిధ కేటగిరీలకు చెందిన 13,913 మంది లబ్ధిదారులకు(Beneficiaries) నూతన చేయూత సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కొత్త పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(Sanjay Kumar), జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. అదనంగా అర్హులైన వారికి మరో 2,000 ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో నూతన పింఛన్ల కోసం సుమారు 18,955 దరఖాస్తులు అందగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి 13,913 మందిని అర్హులుగా గుర్తించి పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఇంకా అర్హత ఉండి పింఛన్లు పొందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి దరఖాస్తులను ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరించి అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనూ అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఒంటరి మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ఈ పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా పింఛన్లు పొందుతున్న 13,913 మంది లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అందించే వాటా పరిమితంగా ఉండగా, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వమే పింఛన్ మొత్తాన్ని భరిస్తోందని వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇంకా పింఛన్లు పొందని అర్హులైన వారికి కూడా రాబోయే రోజుల్లో పింఛన్లు అందుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 2.13 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిందని, మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారుల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను గుర్తించినట్లు వివరించారు.

ఒంటరి మహిళలు – 1,714 మంది (నెలకు రూ.2,016), వితంతువులు – 6,434 మంది (నెలకు రూ.2,016), దివ్యాంగులు – 2,710 మంది (నెలకు రూ.4,016), కల్లుగీత కార్మికులు – 1,873 మంది (నెలకు రూ.2,016), చేనేత కార్మికులు – 100 మంది (నెలకు రూ.2,016), ఫైలేరియా బాధితులు – 1,082 మంది (నెలకు రూ.2,016) మొత్తం 13,913 మంది లబ్ధిదారులు ఉండగా జిల్లాలోని 20 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో ఈ కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు  తెలిపారు.

ఇంకా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు, దరఖాస్తులు సమర్పించినప్పటికీ పరిశీలనలో మిగిలిపోయిన వారు ప్రత్యేక కౌంటర్లలో తమ వివరాలు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను మరోసారి పరిశీలించి, వారం నుంచి రెండు వారాల్లోగా అర్హతలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, డీఆర్‌డీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్ లు, కౌన్సిలర్ లు, నూతన పింఛన్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు