ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
జవహర్ నగర్, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, జవహర్ నగర్ పరిధిలోని కాలనీల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని మాజీ మేయర్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ స్పష్టం చేశారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గబ్బిలాలపేట కాలనీకి చెందిన పలువురు నివాసితులు ఆదివారం శాంతి కోటేష్ గౌడ్‌ను కలిసి తమ కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా శాంతి కోటేష్ గౌడ్ మాట్లాడుతూ.. కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, ప్రతి కాలనీని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రాధాన్యతని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డీఎస్ఎస్ ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ ప్రేమల శ్రీనివాస్, ఆకుల ప్రభాకర్ గౌడ్, వీర్ల భుజంగం, అర్జున్, గబ్బిలాలపేట కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.