ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు!

07-11-2026 | 10:36pm

జనావాసాల మధ్య బాణసంచా విక్రయాలు..

రాయికల్‌లో ఆరు నుంచి ఏడు దుకాణాలు.. ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో  ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల్లో స్పందన కరువైందా? జనావాసాల మధ్య టపాకాయలు,బాణసంచా విక్రయాలు జరుగుతున్నాయంటూ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గత సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాయికల్ పట్టణంలో సుమారు ఆరు నుంచి ఏడు బాణసంచా దుకాణాలు బహిరంగంగా విక్రయాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.నివాస గృహాలు, జనసంచారం ఉండే ప్రాంతాల్లో ఇలాంటి విక్రయాలు నిర్వహించడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా స్పందనేది?

బాణసంచా విక్రయాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.జనావాసాల మధ్య విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని,దుకాణాల అనుమతులు,భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చిన్న నిప్పురవ్వ.. పెను ప్రమాదం!

బాణసంచా అత్యంత సున్నితమైన పేలుడు స్వభావం కలిగిన వస్తువులతో కూడి ఉంటుంది. నిల్వ,విక్రయాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా భారీ అగ్నిప్రమాదానికి దారితీయవచ్చు.ముఖ్యంగా జనావాసాల మధ్య దుకాణాలు ఉండటం,చుట్టుపక్కల ప్రజలు నిరంతరం సంచరించడం ప్రమాద తీవ్రతను పెంచే అవకాశం ఉంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌, నిప్పురవ్వలు వంటి కారణాలతో ప్రమాదం సంభవిస్తే సమీపంలోని ఇళ్లు,ఇతర వ్యాపార సముదాయాలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

అనుమతులున్నాయా? భద్రతా ప్రమాణాలేవి?

పట్టణంలో కొనసాగుతున్న ఆరు నుంచి ఏడు బాణసంచా దుకాణాలకు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? ఏయే ప్రదేశాల్లో విక్రయాలకు అనుమతి ఇచ్చారు? నిబంధనల ప్రకారం టపాసులను నిల్వ చేస్తున్నారా?

అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలును పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ప్రమాదం జరిగాక మేల్కొంటారా?

ప్రజావాణిలో ఫిర్యాదు అందినప్పుడే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడితే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించకపోవడంతో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు,పట్టణ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఏదైనా అవాంఛనీయ ఘటన చోటుచేసుకున్న తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తమై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విక్రయ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు