వివాహేతర సంబంధం.. భర్త హత్యకు దారితీసిన కుట్ర
- హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్
- 24 గంటల్లో హత్య కేసు ఛేదించిన భూపాలపల్లి పోలీసులు
- వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి అవిరినేని సంపత్ రావు
భూపాలపల్లి, నవంబర్ 07 (విజయక్రాంతి): భర్తను హత్య(Murder of husband) చేసి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన కేసును భూపాలపల్లి పోలీసులు(Bhupalpally Police) 24 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ అవిరి నేని సంపత్‌రావు తెలిపారు.శనివారం భూపాలపల్లి డిఎస్పి కార్యాలయంలో లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన అజ్మీర చందునాయక్ (36) తన భార్య పావనితో కలిసి నివసిస్తున్నాడు. గత ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పావనికి మేనమామ వరుసైన ధరావత్ సంతోష్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు వెల్లడించారు.
ఈ విషయం తెలుసుకున్న చందునాయక్ భార్యతో గొడవపడటంతో పాటు ఆమెపై చేయి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పావని తన కారణంగా భర్త చేతిలో దెబ్బలు తింటోందని సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చందునాయక్‌ను హత్య చేయాలని ఇద్దరూ కలిసి పథకం వేసినట్లు డీఎస్పీ వివరించారు.
పథకం ప్రకారం గురువారం అర్ధరాత్రి సమయంలో సంతోష్ గొడ్డలితో చందునాయక్ ఇంట్లోకి వెళ్లాడు. ముందు గదిలో నిద్రిస్తున్న చందునాయక్‌ను పావని నిద్రలేపగా, సంతోష్ గొడ్డలితో అతడి తలపై బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన చందునాయక్ కిందపడిపోగా, పావని గుడ్డతో అతడి ముక్కు, నోరు మూసి శ్వాస ఆడకుండా చేయడంతో మృతి చెందినట్లు వెల్లడించారు.
హత్య అనంతరం సంతోష్ తన ఇంటి నుంచి సంచులు తీసుకొచ్చి మృతదేహాన్ని వాటిలో ఉంచాడు. అనంతరం ఎడ్లబండిపై మృతదేహాన్ని తరలించి చికేన్ పల్లి శివారు ప్రాంతంలో పడేసినట్లు తెలిపారు. హత్య ఆనవాళ్లు కనిపించకుండా ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేసి, పావని, సంతోష్ మోటార్‌సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం మృతుడి సోదరుడు రాజునాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టగా, భూపాలపల్లిలో అనుమానాస్పదంగా మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న పావని, సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు డీఎస్పీ తెలిపారు.
మృతుడు చందునాయక్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారని పేర్కొన్నారు. నిందితులు పావని, ధరావత్ సంతోష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ సంపత్‌రావు అభినందించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సైలు పవన్, గీత తదితరులు పాల్గొన్నారు.