బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
తిరుపతి శాస్త్రాల
భూపాలపల్లి టౌన్, నవంబర్ 07 ( విజయక్రాంతి ) : బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ(Child marriages, child labor system) నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, భద్రత కల్పించాలనే లక్ష్యంతో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, షేర్ ఎన్జీవో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 100 రోజుల విస్తృత అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి షైన్ పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు విధించబడే శిక్షలు చట్టాలు గురించి అవగాహన కల్పించారు.
షేర్ ఎన్జీవో డైరెక్టర్ గోపాల్ రెడ్డి, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ తిరుపతి మాట్లాడుతూ బాల్యం బడిలోనే వికసించాలని, బాలికల భవిష్యత్తుకు బాల్య వివాహాలు అడ్డుకాకూడదని అన్నారు. చిన్నారుల హక్కులను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఆర్సీ సోషల్ మొబిలైజర్ ఆలూరి స్వప్న తదితరులు పాల్గొన్నారు.