ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి,(విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి రూరల్ మండలంలోని నాగారం, దీక్షకుంట, ఆజంనగర్, పంబాపూర్, కమలాపూర్, నందిగామ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు(paddy procurement) కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కేంద్రాల్లో తాగునీరు, తేమ కొలిచే యంత్రాలు, గోనె సంచులు, తూకం, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగుల పేరుతో అనవసర కోతలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.