పాపన్నపేట ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు
పాపన్నపేట: పాపన్నపేట ఎంపీడీఓ విష్ణువర్ధన్(Papannapet MPDO Vishnuvardhan)ను విధుల పట్ల నిర్లక్ష్యం, ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల నేపథ్యంలో గురువారం సస్పెండ్ చేసినట్లు సమాచారం. మండల పరిధిలోని పలు తండాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు 790 మంది గిరిజన కూలీల పేర్లతో పనులు జరిగినట్లు రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ, వారికి కూలి డబ్బులు అందలేదని ఆరోపణలు వచ్చాయి.
కరువు పరిస్థితుల్లో ఉపాధి పనులు(Employment works) కల్పించాల్సిన సమయంలో కూలీలకు పని, వేతనాలు అందకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టగా, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ విష్ణువర్ధన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో మండలంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.