క్యాతూరు పీఏసీఎస్‌ చైర్మన్‌గా నర్సన్ గౌడ్ ప్రమాణ స్వీకారం

11-11-2026 | 11:50pm

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి: సంపత్‌కుమార్

అలంపూర్ నవంబర్ 11: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal district) అలంపూర్ నియోజకవర్గంలోని క్యాతూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) నూతన చైర్మన్‌గా ఉండవల్లి మండలం మరమునగాల గ్రామానికి చెందిన నర్సన్ గౌడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ... నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్‌ చైర్మన్లు రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.

రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఉచిత విద్యుత్‌, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ లక్ష్మీదేవమ్మ, డైరెక్టర్లు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నీలి శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డప్ప, ఉండవల్లి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకటేష్‌ గౌడ్‌, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు