డి-అడిక్షన్ కేంద్రంలో మెరుగైన వైద్య సేవలందించాలి

12-11-2026 | 12:16am

నర్సంపేట, నవంబర్ 11 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా పరిగణించి, వారికి నాణ్యమైన వైద్య సేవలతో పాటు మానసిక ధైర్యం కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(Police Commissioner Shweta) సూచించారు. బుధవారం నర్సంపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న డి-అడిక్షన్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బాధితులు వ్యసనం నుంచి పూర్తిగా బయటపడి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీస్, వైద్య శాఖల సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అనంతరం డి-అడిక్షన్ కేంద్రాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్ది, చికిత్స పొందుతున్న వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని నర్సంపేట ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్, సీఐ శ్రీనివాస్, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్‌స్పెక్టర్ సాయిరమణ, ఆర్‌ఎస్సై పూర్ణచందర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరిబాయి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు