బ్యాంకు చోరీకి యత్నించిన ముగ్గురు నిందితుల అరెస్ట్

11-11-2026 | 11:35pm

బ్లూ కోల్ట్స్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన భారీ చోరీ..

నగదు రివార్డుతో అభినందించిన పోలీస్ కమిషనర్

బోధన్, నవంబర్ 11 (విజయక్రాంతి): బ్యాంకులో చోరీ(Bank Robbery)కి యత్నించిన ముగ్గురు నిందితులను బ్లూ కోల్ట్స్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి పెద్ద నేరం జరగకుండా అడ్డుకున్న పోలీసు సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ అభినందించి నగదు రివార్డులు అందజేశారు.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇండియన్ బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లో చోరీ చేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. అదే సమయంలో రాత్రి విధుల్లో ఉన్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఎస్. నాగరాజు (పీసీ 426), ఎన్. అశోక్ (పీసీ 1937) అప్రమత్తంగా వ్యవహరించి అనుమానితులను గుర్తించారు. వెంటనే స్పందించి చాకచక్యంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.

బ్యాంకు వంటి కీలకమైన ఆర్థిక సంస్థలో చోరీకి యత్నిస్తున్న వారిని సకాలంలో గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో భారీ నేరం జరగకుండా అడ్డుకోగలిగారు. సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, విధి నిర్వహణ పట్ల అంకితభావాన్ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ బ్లూ కోల్ట్స్ సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి అభినందించారు. పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను గుర్తించిన వెంటనే స్పందించాలని ఆదేశించారు.

పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తి, విధి పట్ల అంకితభావం ప్రజల ఆస్తులు, ప్రాణాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీస్ సిబ్బంది పనిచేయాలని, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే సిబ్బందిని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు