మా చిత్రంలో సోషల్ కామెంట్రీ కూడా ఉంటుంది!
హీరో విశ్వదేవ్ రాచకొండ
విశ్వదేవ్ రాచకొండ(Hero Vishadev Rachakonda), బిందుమాధవి లీడ్‌రోల్స్‌లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వదేవ్ రాచకొండ విలేకరుల సమావేశంలో పంచుకున్న సంగుతుల సమాహారం..
యూఎస్ ప్రీమియర్స్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
యూఎస్ రివ్యూస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్, ఆడియన్స్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత ఎంగేజింగ్‌గా ఉన్న సినిమా ఇదే అని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు.
ఇందులో మీరు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు?
-ఇందులో నా పాత్ర పేరు యజ్ఞ. తను ఒక సినిమాలో హీరోగా వరుసగా మూడు హిట్స్ కొట్టి, ఆ తర్వాత కొన్ని అపజయాలు చూసి డౌన్‌ఫాలోలో ఉంటాడు. కాస్త పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించే క్యారెక్టర్. తనను ఫిల్మ్ ఛాంబర్ నుంచి బ్యాన్ చేస్తారు. దీంతో తనకు ఎవరూ అక్కర్లేదని, తానే అన్నీ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. డైరెక్షన్, మాటలు, పాటలు, కొరియోగ్రఫీ.. అన్నీ తానే చూసుకోవాలనుకుంటాడు. అక్కడి నుంచి ఒక కథ రాయడం మొదలుపెడతాడు. అప్పట్నుంచి పిచ్చిపిచ్చి కలలు వస్తుంటాయి. ఆ కలలేంటి? ఆ కలల్లోకి ఎవరు వస్తున్నారు? నిజంగా వచ్చారా? కలలో కనిపించారా? ఇదంతా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఇది ఏ జోనర్ సినిమా?
ఇది సర్వైవల్ డ్రామా, డార్క్ కామెడీ, మ్యూజికల్, సైకలాజికల్ థ్రిల్లర్.. ఇలా ఉత్కంఠగా సాగే సినిమా. ఇందులో సోషల్ కామెంట్రీ కూడా ఉంటుంది. ఇప్పటివరకు చూడని ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను క్రియేట్ చేశాం. -ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది. హీరోతో పాటు మిగతా క్యారెక్టర్లు కూడా చాలా కీలకంగా ఉంటాయి. సినిమా చాప్టర్లుగా ఉంటుంది.
సినిమా బిజినెస్ పరంగా ఎలా ఉంది?
-బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికే సీక్రెట్ స్క్రీనింగ్ వేశాం. అక్కడికి వచ్చిన వాళ్ల నుంచి వచ్చిన స్పందన మాకు మరింత నమ్మకాన్నిచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ఫిల్మ్ మేకర్స్‌కు స్ఫూర్తిమంతంగా ఉంటుంది.
-మాటలతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఒక ప్రయోగం ఇందులో చేశాం. అది చాలా అద్భుతంగా వచ్చింది. ‘పరేషాన్’, ‘35’ సినిమాల కథలు విన్నప్పుడే కచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఇస్తాయని అనిపించింది. డార్క్ చాక్లెట్ కథ కూడా కొత్తగా అనిపించింది.
మీ తాత రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలు చదివారా?
కొన్ని చదివాను. తాత సాహిత్యం వైపు ఉండేవారు. నేను డాన్స్, మ్యూజిక్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపించేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, మేమందరం కలిసి ఒక మ్యూజిక్ ట్రూప్ ఉండేది. అందులో నేను పాడేవాణ్ని, గిటార్ వాయించేవాణ్ని.
బిందుమాధవి పెర్ఫార్మెన్స్ గురించి..?
బిందు ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇందులో ఇచ్చిందని సినిమా చూసిన వాళ్లందరూ చెబుతున్నారు.
రానా సపోర్ట్ ఎలా ఉంది?
ఆయన ప్రొడక్షన్ పేరు స్పిరిట్ మీడియా. ఆయన ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. పరేషన్, 35 సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘డార్క్ చాక్లెట్’కు కూడా మంచి రిలీజ్ ఇస్తున్నారు. మేము కలిసి మరింత మంచి కంటెంట్ ఇవ్వాలని ప్లాన్స్ కూడా ఉన్నాయి.
మీ నుంచి కొత్తగా రాబోతున్న సినిమాలు..?
-ప్రస్తుతం నా దగ్గరకు మంచి కథలు వస్తున్నాయి. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేశా. నా నుంచి రాబోయే రోజుల్లో చాలా మంచి సినిమాలు చూడబోతున్నారు. అవన్నీ కూడా అందరూ గొప్పగా మాట్లాడుకునే సినిమాలే అవుతాయని నమ్ముతున్నా. అలాగే మా ప్రొడక్షన్‌లో కూడా కొన్ని ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.