మూగ పాత్రకు డబ్బింగ్.. కొత్త అనుభూతినిచ్చింది!

12-11-2026 | 12:16am

ఛాలెంజింగ్ క్యారెక్టర్‌తో నటుడిగా పరిచయం.. 

స్టార్స్ సపోర్ట్ బాధ్యతను పెంచింది 

‘ఇట్లు అర్జున’ చిత్ర కథానాయకుడు అనీష్ 

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరో(Actor Aneesh)గా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేశ్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అనీష్ విలేకరులతో పంచుకున్న సినిమా విశేషాలివీ.. 

ఈ కథతోనే మీ తొలి సినిమా చేయడానికి కారణమేంటి?

-ఈ కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చిన అంశం ఒక మూగవాడి ప్రేమకథ. తన భావాలను మాటల్లో వ్యక్తపరచలేని వ్యక్తి ప్రేమను ఎలా చూపిస్తాడనేది నాకు చాలా నచ్చింది. అలాగే కథ నడిచే విధానం, హీరో, హీరోయిన్ ప్రయాణం, యాక్షన్, భావోద్వేగాలు చాలా సహజంగా అనిపించాయి. ఇందులో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలున్నాయి. అలాంటి సందర్భాలను ఒక మూగవాడు ఎలా ఎదుర్కొంటాడు అనేది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది.

ఈ పాత్ర కోసం ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు?

-ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలల పాటు వర్క్‌షాప్ చేశాం. బాడీ లాంగ్వేజ్, రియాక్షన్స్, ఎక్స్‌ప్రెషన్స్.. విషయాలపై డైరెక్టర్‌కు చాలా క్లారిటీ ఉంది. కొంత సైన్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించాం. అయితే అది అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రతి సీన్‌ను ముందుగానే రిహార్సల్స్ చేసేవాళ్లం. దాంతో పాత్రలోకి వెళ్లడానికి చాలా ఉపయోగపడింది. 

ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి స్టార్స్ మీకు సపోర్ట్ చేశారు కదా! 

-అంత పెద్ద స్టార్స్ వచ్చి మా సినిమా గురించి మాట్లాడటం ఇప్పటికీ నాకు ఒక కలలాగే అనిపిస్తోంది. మా కంటెంట్ నచ్చడం వల్లే ఈ స్థాయిలో సపోర్ట్ వచ్చిందని భావిస్తున్నా. ఒక కొత్త నటుడికి ఇంత పెద్ద సపోర్ట్ లభించడం నిజంగా సంతోషంగా ఉంది. అదే సమయంలో ఇది నా మీద మరింత బాధ్యతను పెంచింది.  

సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోంది?

-యాక్షన్‌ను ఇందులో చాలా కొత్తగా డీల్ చేశాం. ఇది ఒక అండర్‌డాగ్ క్యారెక్టర్‌కు తగ్గట్టుగానే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే యాక్షన్‌లో కాకుండా ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. యాక్షన్‌లో సహజంగా వచ్చే సౌండ్స్‌ను మ్యాచ్ చేయడానికి డబ్బింగ్ కూడా చెప్పాను. మాటలు లేకుండా కేవలం బాడీ కదలికలు, ‘హమ్ ..హ’ లాంటి ఎక్స్‌ప్రెస్ ప్రెషన్‌కు డబ్బింగ్ చెప్పడం కూడా చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. నాది చాలా జెన్యూన్ క్యారెక్టర్. ఆ భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. 

ఏడాది పాటు కథలు విన్నారట?! 

అవును. తొలి సినిమా చేయడానికి ముందు దాదాపు ఏడాది పాటు కథలు విన్నాను. ఆ సమయంలో మహేశ్ ఈ కథ తీసుకొచ్చారు. నాకు చాలా నచ్చింది. కథ ఓకే చేసిన తర్వాత కూడా మరో ఏడాది పాటు వర్క్‌షాప్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశాం. నటుడిగా నా ప్రయాణం ప్రారంభించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. లక్కీగా అందరికీ కనెక్ట్ అయ్యే మంచి ఎమోషన్ ఉన్న కథ దొరికింది.

మూగవాడి పాత్రతో మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి?

-కొన్ని సన్నివేశాల్లో రియాక్ట్ అవ్వడం చాలా సవాలుగా అనిపించింది. సాధారణంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం డైలాగ్‌తో సమాధానం చెబుతాం. కానీ ఈ పాత్రలో మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మన హావభావాలే పలకికంచడం ద్వారానే స్పందించాలి. అది కొంచెం కష్టంగా అనిపించింది. అలాగే లిప్ సింక్ లేకుండా డ్యాన్స్ చేయడం కూడా ఛాలెంజింగ్‌గా అనిపించింది. 

రామ్‌చరణ్, అఖిల్ కెరీర్‌లో ఒక దశ తర్వాతే ఇలాంటి సవాళ్లతో కూడిన పాత్రలు చేశారని నాగార్జున చెప్పారు కదా.. మీరు తొలి సినిమాతోనే మూగవాడి పాత్ర చేయడం ఎలా అనిపించింది?

-అంత పెద్ద స్టార్సోతో నన్ను పోల్చుకోను. ఏదైనా కథ దొరికిన దాని ప్రకారమే ఉంటుందని భావిస్తున్నా. నా తొలి సినిమాకే ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాగార్జున మా సినిమాను ప్రజెంట్ చేయడం మాకు మరింత బలాన్నిచ్చింది.  

అనస్వర రాజన్ గురించి చెప్పండి?

తనకు ఇప్పటికే మంచి అనుభవం ఉంది. తను అద్భుతమైన పెర్ఫార్మర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ సినిమాలో తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది.

నాగార్జున సినిమా చూసిన తర్వాతే ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చారా?

అవును. నాగార్జున మా సినిమా చూశారు. ఆయనకు సినిమా చాలా నచ్చింది. ఆయన రావడం మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. 

మీ నాన్న కూడా సినిమాలు నిర్మించారు కదా? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది?

-మా నాన్నకి భక్తిభావం ఎక్కువ. ఆధ్యాత్మిక కథలను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో నాగార్జునతో రెండు సినిమాలు నిర్మించారు. నాకు సినిమాలపై ఆసక్తి ఉందని చెప్పినప్పుడు నన్ను చాలా ప్రోత్సహించారు. -నేను లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుకున్నా. నచ్చిన పని చేసుకోమని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా.

సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు చేయడం ఎలా అనిపించింది?

-ఈ సినిమాలో యాక్షన్‌ను చాలా ఎంజాయ్ చేశాను. దినేశ్ మాస్టర్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే యాక్షన్‌లా కాకుండా, ఒక సాధారణ వ్యక్తి తన పరిస్థితులకు తగ్గట్టుగా చేసే యాక్షన్‌లా ఉంటుంది. దాదాపు అన్ని యాక్షన్ సీక్వెన్సులను నేనే చేశా. డూప్ ఎక్కడా ఉపయోగించలేదు. ఇది నాకు చాలా కొత్త అనుభవం.  

తొలి సినిమాతో నటుడిగా నేర్చుకున్న విషయాలేంటి?

-యాక్టర్ కావాలని అనుకునప్పుడు మనం సినిమాను స్క్రీన్ మీద చూస్తాం. కానీ తెర వెనుక ఎంత కష్టం ఉంటుందనేది ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది. ఒక సినిమా చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంతమంది కష్టపడతారు అనేది ఈ ప్రయాణంలో అర్థమైంది. సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది.

భవిష్యత్తులో ఎలాంటి కథలు చేయాలని అనుకుంటున్నారు?

ఏ సినిమా చేసినా ప్రేక్షకులు దాన్ని ఆస్వాదించి, మంచి ఎమోషన్‌తో ఇంటికి వెళ్లాలనేది నా కోరిక. అలాంటి మంచి భావోద్వేగాలు ఉన్న కథలు చేయాలని ఉంది. ఇప్పటికైతే ఏ జోనర్ అని నిర్ణయించుకోలేదు. రెండు మూడు కథలు విన్నా. బలంగా నచ్చి, నాకు సరిపోయే కథతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నా.

మరిన్ని వార్తలు