70 రెవెన్యూ గ్రామాల్లో దశలవారీగా రీ సర్వే..

11-11-2026 | 11:41pm
  1. పట్టాదారుల సమస్యల పరిష్కారమే రీ సర్వేలో కీలకం!
  2. అభ్యంతరాల సమయంలో క్షేత్రస్థాయిలో ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల పర్యటనలు
  3. పట్టాదారులకు అవగాహన.. గ్రామాల్లో ముందస్తు ప్రచారం, ఫ్లాగ్ పోల్స్ ఏర్పాటు
  4. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, నవంబర్11 (విజయక్రాంతి): భూముల రీ సర్వే అంటే కేవలం భూముల కొలతలు, హద్దుల నిర్ధారణకే పరిమితం కాకుండా.. ప్రతి పట్టాదారుడి సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.

రీ సర్వే అనంతరం అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు నేరుగా గ్రామాల్లో పర్యటించి భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, హద్దుల వివాదాలు, ఇతర రెవెన్యూ సమస్యలపై విచారణ జరిపి పరిష్కారం చూపాలని కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 70 రెవెన్యూ గ్రామాల్లో దశలవారీగా రీ సర్వే చేపడుతున్నట్లు. వివరించారు 

ఈ మేరకు బుధవారం రాత్రి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావుతో పాటు పలువురు సంబంధిత అధికారులతో కలెక్టర్ రీ సర్వే ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే పురోగతి, తదుపరి కార్యాచరణ, అభ్యంతరాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

*27 గ్రామాల్లో సర్వే పనులు*

ఇప్పటికే 27 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని,  సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, తదుపరి దశలో 9(2) నోటీసుల జారీ వరకు తీసుకెళ్లేలా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. మరో 27 గ్రామాల్లోనూ సర్వే ప్రారంభించేందుకు ఆసక్తి ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్లతో మరోసారి సమావేశం నిర్వహించి కొత్త బృందాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే వారంలో అదనంగా 10 రోవర్లు అందుబాటులోకి వస్తే సర్వే పనులను మరింత విస్తరిస్తామన్నారు. ఇప్పటివరకు 21,114.29 ఎకరాల విస్తీర్ణంలో రీ సర్వే పూర్తయిందన్నారు 

*పట్టాదారులకు అండగా ప్రత్యేక కార్యాచరణ*

రీ సర్వేలో పట్టాదారుల భాగస్వామ్యం, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అభ్యంతరాల సమయంలో ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు గ్రామాలను సందర్శించి భూ విస్తీర్ణంలో తేడాలు, తక్కువ లేదా ఎక్కువ నమోదైన భూములు, సరిహద్దుల వివాదాలపై రెవెన్యూ విచారణ చేపట్టాలన్నారు. పట్టాదారులకు అవసరమైన సహకారం అందిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ, అభ్యంతరాల స్వీకరణపై ముందుగానే ప్రజలకు సమాచారం అందించేందుకు డప్పు చాటింపు  నిర్వహించాలని ఆదేశించారు.

అవసరమైన చోట ఫ్లాగ్ పోల్స్ ఏర్పాటు చేసి, సర్వేకు సంబంధించిన ప్రక్రియను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. గ్రామపంచాయతీ అధికారులకు (జీపీఓ) కూడా ఈ అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించి, గ్రామస్థాయిలో ప్రజలకు సరైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు చేపట్టిన రీ సర్వే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.

*సర్వేయర్లకు పారితోషికం.. భద్రతకు ప్రాధాన్యం*

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రతి 15 రోజులకు ఒకసారి పారితోషికం విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని పాముకాటు వంటి ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే సేఫ్టీ బూట్లను కూడా సమకూర్చినట్లు తెలిపారు. జిల్లాలో రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పట్టాదారులకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు లబ్ధిదారుల గుర్తింపు పూర్తి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతోపాటు, వారికి సంబంధించిన ప్రొసీడింగ్స్ తయారీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు 50 శాతం ప్రొసీడింగ్స్ తయారీ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేస్తామని, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు