భూక్య రెడ్డి తండా అభివృద్ధికి కోటి రూపాయల నిధులు

11-11-2026 | 11:48pm

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన

కోనరావుపేట, నవంబర్ 11 (విజయక్రాంతి): పల్లెలు, గిరిజన తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) అన్నారు. కోనరావుపేట మండలంలోని భూక్య రెడ్డి తండాలో గిరిజన ప్రత్యేక నిధుల నుంచి రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఆయన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన కోనరావుపేట మండలంలోని చిన్న గ్రామపంచాయతీ భూక్య రెడ్డి తండా అభివృద్ధికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గ్రామ సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చడం, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఫీజు రాయితీలు అందిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు