బాలానగర్-గంగాపూర్ రహదారిని బాగు చేయండి.. కలెక్టర్‌కు వినతి

11-11-2026 | 11:31pm

సత్వరమే రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా: మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా హామీ

లింగంపేట సర్పంచ్ రామ్ నోళ్ళు బాలు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత

జడ్చర్ల, నవంబర్ 11: జడ్చర్ల మండలం గంగాపూర్ నుండి లింగంపేట్ వరకు వెళ్లే రహదారి గత రెండేళ్లుగా పూర్తిగా అధ్వాన స్థితికి చేరిందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ లింగంపేట గ్రామస్తులు బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా(Collector Khushboo Gupta)కు వినతిపత్రం అందజేశారు.

గ్రామ సర్పంచ్ రామ్ నోళ్ళ బాలు ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ రహదారి గుంతలమయంగా మారడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఎంతోమంది గాయాలపాలయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే రహదారిపై జరిగిన ప్రమాదంలో గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ సైతం మృతి చెందారని వినతిపత్రంలో పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం ఈ దారిలో ప్రయాణించడానికి నరకయాతన అనుభవిస్తున్నారని, ముఖ్యంగా గర్భిణీలను సకాలంలో ఆసుపత్రికి తరలించడం కష్టతరంగా మారిందని వివరించారు.

గ్రామస్తుల సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్ ఖుష్బూ గుప్తా సానుకూలంగా స్పందించారు.ఈ సమస్యను పరిశీలించి,అతి త్వరలోనే రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కలెక్టర్ స్పందన పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ,త్వరగా రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలు,ఉప సర్పంచ్ గోపీనాయక్, వార్డు సభ్యులు మావిళ్ళ పవన్, రవి, వెంకటస్వామి గౌడ్, బాలాజీ, నిరంజన్, జంగాల కృష్ణయ్య, యాదగిరి, శివకుమార్, మావిళ్ళ చంద్రయ్య, కృష్ణయ్య మరియు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు