కామారెడ్డిలో బియ్యం ధరలకు రెక్కలు
బిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో బియ్యం ధరల కృత్రిమ పెంపు, అక్రమ నిల్వలపై(Illegal Rice Stock) చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు(District Civil Supplies Officer Venkateshwarlu)కు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఫిర్యాదు చేశారు. ఎల్నినో పరిస్థితులను(El Nino Conditions) సాకుగా చూపుతూ కొందరు వ్యాపారులు, రైస్ మిల్లర్లు సన్నబియ్యం కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆరోపించారు.
బీపీటీ, కేఎన్ఎం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోనా) రూ.74, హెచ్ఎంటీ, జై శ్రీరామ్ రకాలు రూ.79 ఉండాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో రూ.90 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. నాణ్యత లేని బియ్యాన్ని ప్రీమియం రకాల పేరుతో అమ్ముతున్నారని, మిల్లులు, గోదాముల్లో అక్రమ నిల్వలు ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా రైస్ మిల్లులు, గోదాములు, హోల్సేల్ కేంద్రాల్లో విజిలెన్స్, టాస్క్ఫోర్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధరలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ధరల భారం పడకుండా ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు బియ్యం అందించాలని శ్రీరామ్ వెంకటేష్ కోరారు.