బైజూస్ ఫ్యామిలీ ప్లాట్లు.. మీషో బాస్ సొంతం
ఒకప్పుడు ఎడ్టెక్ రంగంలో ఓ వెలుగు వెలిగిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కుటుంబానికి చెందిన ఆస్తుల విక్రయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా మీషో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ (Vidit Aatrey) బెంగళూరులో రూ.83.81 కోట్ల విలువైన రెండు విలాసవంతమైన ప్లాట్లను కొనుగోలు చేశారు.
బెంగళూరులోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఎప్సిలాన్ (Epsilon) గేటెడ్ కమ్యూనిటీలో ఈ రెండు ప్లాట్ల కొనుగోలు జరిగింది. ఈ స్థలాలు బైజు రవీంద్రన్ కుటుంబ సభ్యులైన దివ్య గోకుల్నాథ్, దీప్తి అఖిల రాఘవన్కు చెందినవి. మొత్తం 33,475 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ రెండు స్థలాల కోసం విదిత్ ఆత్రేయ రూ.83.81 కోట్లు వెచ్చించారు.
రెండు వేర్వేరు విక్రయ ఒప్పందాల ద్వారా ఈ లావాదేవీలు పూర్తయ్యాయి. దివ్య గోకుల్నాథ్కు చెందిన 18,305 చదరపు అడుగుల స్థలాన్ని రూ.48.11 కోట్లకు కొనుగోలు చేశారు. దీప్తి అఖిల రాఘవన్కు చెందిన 15,180 చదరపు అడుగుల స్థలాన్ని కూడా విదిత్ సొంతం చేసుకున్నారు. రెండు స్థలాలకు కలిపి చదరపు అడుగుకు సగటున రూ.25,029 ధర చెల్లించినట్లు తెలుస్తోంది. బెంగళూరు విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ డీల్ చర్చనీయాంశంగా మారింది.
బైజూస్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆస్తుల కొనుగోలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్తులో రుణదాతల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనేలా కొనుగోలు ఒప్పందాల్లో ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ న్యాయ సంస్థ సిరిల్ అమర్చంద్ మంగళదాస్ రూపొందించిన పత్రాల్లో ఇండెమ్నిటీ క్లాజులు పొందుపరిచినట్లు సమాచారం. ఆస్తులపై రుణదాతల క్లెయిమ్లు లేవని, అవి విక్రయదారుల వ్యక్తిగత యాజమాన్యంలో ఉన్నాయని హామీలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు వేల కోట్ల విలువైన సంస్థగా గుర్తింపు పొందిన బైజూస్.. ఆర్థిక ఇబ్బందులు, రుణ వివాదాలు, నిర్వహణ సమస్యలతో కుదేలైంది. సంస్థ మాతృ కంపెనీ దివాళా ప్రక్రియలో ఉండటంతో వ్యవస్థాపకుల కుటుంబానికి చెందిన ఆస్తుల విక్రయాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో మీషో సీఈఓ రూ.83.81 కోట్లతో రెండు స్థలాలను కొనుగోలు చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.