అర్హులకు పెన్షన్ ఆగొద్దు - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ,(విజయక్రాంతి): జనగామ మండలం(Jangaon Mandal) చీటకోడూరు రైతు వేదిక వద్ద మంగళవారం జరిగిన నూతన చేయూత పెన్షన్ల(Cheyutha Pensions) మంజూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు. జనగామ మండలంలోని 21 గ్రామాల్లో 781 మందికి నూతన పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో 412 మంది వితంతువులు, 86 మంది ఒంటరి మహిళలు, 218 మంది దివ్యాంగులు, 28 మంది నేత కార్మికులు, 77 మంది గీత కార్మికులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనం ఉందనే కారణంతో, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఉందనే కారణంతో నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ నిరాకరించొద్దని అన్నారు. అప్పులు చేసి ట్రాక్టర్లు, డీసీఎంలు కొని అద్దెకు నడుపుతూ కుటుంబాలను పోషించుకునే పేదల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.
పెండింగ్ లో ఉన్న, తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. దివ్యాంగుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ తో పాటు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా నిరంతరం నిలబడతానని, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య, విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.