క్యాస్టింగ్ కౌచ్‌పై నటి రమ్యకృష్ణ ఏమన్నారంటే?
సినీ పరిశ్రమ(Film Industry)లో తెరవెనుక జరిగే వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది. సీనియర్ నటి రమ్యకృష్ణ(Senior Actress Ramya Krishna) క్యాస్టింగ్ కౌచ్, సినిమా షూటింగ్ సెట్స్‌లో గతంలో నటీమణులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు.
క్యాస్టింగ్ కౌచ్‌పై ఏమన్నారంటే?
సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఉందా? అనే ప్రశ్నకు రమ్యకృష్ణ స్పష్టమైన సమాధానమిచ్చారు. ఈ తరహా వేధింపులు గతంలోనూ ఉన్నాయని, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులోనూ పూర్తిగా కనుమరుగవుతాయని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ లైంగిక దోపిడీకి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మన దగ్గర అలాంటివి జరగవని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు ఎదురు చెప్పే అవకాశం ఉందా? లేదా అన్నది కాలానుగుణంగా మారుతుందని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ గ్లామర్‌తో ముడిపడి ఉండటంతో ఈ అంశాలకు ఎక్కువ ప్రచారం లభిస్తోందని, వాస్తవానికి ఇలాంటి వేధింపులు ఇతర రంగాల్లోనూ, లింగభేదం లేకుండా చోటుచేసుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
అంబాసిడర్ కారులోనే మేకప్.. కనీస సౌకర్యాలూ లేవు!
క్యాస్టింగ్ కౌచ్ అంశంతో పాటు, తన కెరీర్ తొలినాళ్లలో షూటింగ్ సెట్స్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో నటీమణుల కోసం ప్రత్యేక కారవాన్లు, వాష్‌రూమ్‌లు, ప్రైవసీ కల్పించే సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావని తెలిపారు.
దీంతో షూటింగ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో అంబాసిడర్ కారులోనే బాటిల్స్‌ను ఉపయోగించాల్సి వచ్చేదని చెప్పారు. ఒక షూటింగ్ నుంచి మరో షూటింగ్‌కు వెళ్లే క్రమంలో సమయం ఆదా చేసుకోవడానికి కారులోనే స్వయంగా మేకప్ వేసుకునేవాళ్లమని వెల్లడించారు.
ఇప్పటి నటీనటులు అదృష్టవంతులు!
ప్రస్తుత సినిమా సెట్స్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రమ్యకృష్ణ పేర్కొన్నారు. నటీనటులకు ఇప్పుడు కారవాన్లు, మేకప్ సదుపాయాలు, ఇతర ప్రాథమిక వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తమ తరం కళాకారులు ఎదుర్కొన్న కష్టాల్లో కనీసం పావు వంతు కూడా నేటి తరం నటీనటులు పడటం లేదని అభిప్రాయపడ్డారు. రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పాత తరం హీరోయిన్లు షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న కనీస సౌకర్యాల లేమిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.