మహేశ్ ఖాతాలో మరో రికార్డు.. వారణాసికి భారీ ధర

17-11-2026 | 12:31pm

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli), సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ రూ.285 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డుగా నిలవనుంది.

రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ‘వారణాసి(Varanasi)’ తెలుగు రాష్ట్రాల హక్కులకు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వం, మహేశ్ బాబు హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రూ.285 కోట్ల థియేట్రికల్ బిజినెస్ వార్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. బాక్సాఫీస్ వద్ద ‘వారణాసి’ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు