చెక్‌డ్యామ్‌ల ఫలితం.. ఐదు గ్రామాల్లో రైతుల హర్షం
భూగర్భ జలాల పెరుగుదలతో రెండు పంటలు.. రైతుల ముఖాల్లో ఆనందం
పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఐదు గ్రామాల రైతులు
బాన్సువాడ, నవంబర్ 29 (విజయక్రాంతి): మంజీరా నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడటంతో రైతులు రెండు పంటలు సాగు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. దీంతో బండపల్లి, గుండె నమ్లి, వాజిద్నగర్, పూల్‌కల్, బండ రెంజల్ గ్రామాలకు చెందిన రైతులు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivas Reddy)ని కలిసి తమ ఆనందాన్ని పంచుకుంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు, బావుల్లో నీరు లేక పంటలు సాగు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు వివరించారు.
ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్య చాలావరకు పరిష్కారమైందని, రెండు పంటలు సమృద్ధిగా సాగు చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రైతులను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, నాయకులు రైతుల పక్షాన చిత్తశుద్ధితో పనిచేస్తే రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే స్థాయి నుంచి బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే స్థాయికి ఎదుగుతారని అన్నారు. రైతన్న చేయి ఎప్పుడూ కింద ఉండకూడదని, నలుగురికి సాయం చేసే స్థాయిలో పైన ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలని, తన నియోజకవర్గంలోని రైతులు సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం లక్షా 48 వేల ఎకరాల సాగుభూమి ఉందని, ఇందులో సుమారు 98 వేల ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్నాయని తెలిపారు. మిగిలిన భూములకు బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతోందన్నారు. సుమారు 10 వేల ఎకరాలకు జాకోర, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, మిగిలిన భూములకు సిద్ధాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐదు గ్రామాల రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.