గంజాయి, మత్తు పదార్థాలపై పోలీసుల ఉక్కుపాదం!
నార్కోటిక్ డాగ్‌తో ఇల్లందకుంట, సీతంపేటలో విస్తృత తనిఖీలు
హుజురాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందకుంట ఎస్ఐ కాంత్రికుమార్ హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లందకుంట, సీతంపేట గ్రామాల్లో నార్కోటిక్ డాగ్(Narcotic Dog) సహాయంతో కిరాణా దుకాణాలు, హోటళ్లు, పాన్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించినా, వినియోగించినా, రవాణా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, వినియోగం లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.