మండలంలో కల్లు దుకాణాలు బందు

14-11-2026 | 07:38pm

తాడ్వాయి,నవంబర్,14 ( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో శనివారం కల్లు దుకాణాలు(Toddy shops) మూసి ఉన్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో సదరు కల్లు వ్యాపారులు(Toddy traders) కల్లు దుకాణాలను మూసి ఉంచారు.ఈనెల 10న తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో(Mandal Parishad Office) నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో కొందరు సభ్యులు మండలంలోని కల్లు దుకాణాలలోని కల్లులో ఎక్కువ మోతాదులో మందులు కలిపి విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కల్లులో అనేక రకాల ఇబ్బందికర పదార్థాలు కలుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మత్తు పదార్థాలు కలపడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని  వాపోయారు.అయినా సదరు ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని సభ్యులు మండిపడ్డారు.ఈత చెట్లు ఉంటేనే కల్లు దుకాణాలకు లైసెన్సులు ఇవ్వాలని సభ్యులు ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు.

ఈ విషయమై ఎక్సైజ్ శాఖ అధికారులు మండలంలోని కల్లు దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.దీంతో సదరు వ్యాపారులు ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయోనని, మండలంలోని వ్యాపారులు సమావేశమై దుకాణాలను మూసి ఉంచినట్లు తెలిసింది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు మండలంలోని గ్రామాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు