నీటి నిల్వలు తక్కువ.. అయినా గేట్లు ఎత్తారు

14-11-2026 | 07:31pm

హైదరాబాద్: సింగూరు ప్రాజెక్టు(Singur Project)లో నీటి నిల్వలు తగ్గుతున్నా.. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవసరాలకు అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లను ఎత్తి దిగువన ఉన్న మంజీరా బ్యారేజీకి నీటిని(Manjeera Barrage Water) తరలిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం సుమారు 29 టీఎంసీలు. అయితే ప్రస్తుతం జలాశయంలో కేవలం 2.3 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గడంతో మిగిలిన నీటిని జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సింగూరు ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తారు. సుమారు 0.5 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరు మంజీరా బ్యారేజీకి చేరనుంది. అక్కడి నుంచి ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు వినియోగించనున్నారు. ఒకవైపు జలాశయంలో నిల్వలు తగ్గుతుండగా.. మరోవైపు ప్రజల తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారుల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు