‘భారత్ సమ్మిట్’ను వ్యతిరేకిస్తూ బీజేపీ భారీ నిరసన
తెలంగాణ చౌక్‌లో నల్లజెండాలతో ఆందోళన..
రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం
పోలీసులు, కార్యకర్తల మధ్య పెనుగులాట..
బిజెపి శ్రేణుల అరెస్ట్
ముకరంపుర, నవంబర్ 14(విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్(Bharat Summit)’ను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ(Karimnagar District Bharatiya Janata Party) ఆధ్వర్యంలో శనివారం రోజున పట్టణంలోని తెలంగాణ చౌక్ లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం నేతృత్వంలో పెద్ద ఎత్తున చేరుకున్న నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాజరుకావడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల(Revanth Reddy) దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర పెనుగులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటపాటు సాగిన ఈ ఆందోళనతో తెలంగాణ చౌక్ పరిసర ప్రాంతాల్లో నలువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంతో పాటు సుమారు 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది ‘భారత్ సమ్మిట్’ కాదని, అది ‘దేశవ్యతిరేక సమ్మిట్’ అని ఆయన ఆరోపించారు. దేశ ప్రధానిని, దేశ అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు, రాజ్యాంగబద్ధ సంస్థలను అగౌరవపరిచే వ్యక్తులకు హైదరాబాద్‌ను వేదికగా మార్చడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.
అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వై. సునీల్ రావు, జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు దుర్శెట్టి సంపత్, గాజుల స్వప్న, రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేష్, జిల్లా కార్యదర్శులు గుంజెటి శివ, , కోల అశోక్, చెపూరి సత్యం, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఆకుల రాజేందర్, బత్తులలక్ష్మీనారాయణ ,శ్రీనివాస్ నాయక్, సమీ పర్వేజ్ ,జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర , అలివేలు సమ్మిరెడ్డి , జాన పట్ల స్వామి, సుధాకర్ పటేల్ ఐటీ ఇంచార్జి అన్నాజీ వినీత్, కార్పొరేటర్లు భూపతి రవీందర్, మాసం గణేష్, పొన్నం మొండయ్య, జీవి రమణ , మహిళ నాయకురాలు విజయ, మామిడి చైతన్య , జోన్ అధ్యక్షులు అవుదుర్తి శ్రీనివాస్, జాడి బాల్ రెడ్డి, తణుకు సాయి, బండారి గాయత్రి, ఉప్పరపల్లి శ్రీనివాస్ , ఈసంపల్లి మహేష్ లతోపాటు వివిధ మండలాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.