విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ముందస్తు చర్యలు
- కరీంనగర్ సర్కిల్ ఎస్ ఈ ఏ విజయేందర్ రెడ్డి
కరీంనగర్ సిటీ, నవంబరు 17 (విజయక్రాంతి): రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పెరగనున్న విద్యుత్ లోడ్ డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసేందుకు అన్ని సత్వర చర్యలు చేపడుతున్నామని కరీంనగర్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఏ విజయేందర్ రెడ్డి(Karimnagar Circle SE Vijayender Reddy) తెలిపారు.
వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధిక లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇప్పటివరకు 36 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 64 ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంపు, 6 కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 3 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంపు, 6 నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇంకనుక్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయవలసిన ట్రాన్స్ఫార్మర్లు, అలాగే పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంపు వంటి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఎస్ఈ వివరించారు.