చివరి మజిలీకి కష్టమే..!
శ్మశానవాటికలో సమస్యల తిష్ట
- షెడ్డుకు పరిమితమైన వైకుంఠ రథం
- అసంపూర్తిగా కల్వర్టు నిర్మాణం
కేసముద్రం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram Municipality) పరిధిలో చివరి మజిలీకి(Final Journey) కష్టతరంగా మారింది. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఆదర్శ నగర్ శ్మశాన వాటికలో(Adarsh Nagar Crematorium) కనీస సౌకర్యాలు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటిక రహదారి మధ్యలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ (SRSP Canal)పై కల్వర్టు నిర్మించి అప్రోచ్ రోడ్డు వేయకుండా వదిలేశారు. దీనితో చుట్టూ తిరిగి రావలసిన పరిస్థితి నెలకొంది. ఇక శ్మశాన వాటికలో నిలువ నీడ లేకుండా పోయింది.
షెడ్లు పూర్తిగా శిధిలంగా మారాయి. పార్థివదేహాల దహనం అనంతరం స్నానం ఆచరించినందుకు స్నానాల గదులు సరిగా లేవు. దీనితో మహిళలు, పిల్లలు, వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్నప్పటికీ శ్మశాన వాటికలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నత్త నడకన పనులు
శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఇటీవల 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కాంపౌండ్ వాల్, ఇంటర్నల్ సిమెంట్ రోడ్డు, కల్వర్టు నిర్మాణం, దింపుడు కళ్లం, ఇతర సౌకర్యాల పనులు ఆశించిన మేర జరగడంలేదని చెబుతున్నారు. దీనితో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
షెడ్డుకే పరిమితమైన వైకుంఠ రథం
కేసముద్రం స్టేషన్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో పట్టణ ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రముఖ వ్యాపారి, దాత దివంగత లెంకలపల్లి వెంకటేశ్వర్లు వైకుంఠ రథాన్ని సమకూర్చారు. కొద్దిరోజుల పాటు గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో వైకుంఠ రథం ప్రజలకు సేవలందించింది. ఆ తర్వాత గ్రామం కాస్త మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఇప్పుడు వైకుంఠ రథాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
దీనితో వైకుంఠ రథం ఎందుకు పనికి రాకుండా షెడ్డు కు పరిమితం అయ్యింది. ఫలితంగా పట్టణ ప్రజలు చనిపోయిన వారి పార్థివ దేహాలను శ్మశాన వాటికకు తీసుకువచ్చేందుకు ప్రైవేటు వాహనాల్లో తీసుకువస్తున్నారు. పేదలకు వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్ బాక్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా శ్మశాన వాటిక అభివృద్ధి పనులను వేగవంతంగా నిర్వహించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
అనాధలకు ఆశ్రయం ఏది.?
పట్టణం గా విస్తరించినప్పటికీ కేసముద్రంలో అనాధలకు సరైన ఆశ్రయం లేకుండా పోయింది. అద్దెకు ఉండే పేదల్లో ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాలు, ఖర్మ నిర్వహించడానికి ఇంటి యజమానులు అంగీకరించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. స్మశాన వాటిక లోనే ఖాళీ స్థలంలో అనాధ ప్రజల కోసం షెల్టర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో చూపడం లేదు. ఇప్పటికైనా అనాధల కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేసి, దహన సంస్కారాలతో పాటు ఖర్మకాండలు నిర్వహించుకునే విధంగా వసతులు కల్పించాలని కోరుతున్నారు.