అనంతాద్రి దేవాలయ భూములను రక్షించాలి!
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రంలోని అనంతాద్రి శ్రీ జగన్నాథ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన భూములను పరిరక్షించాలని దేవస్థాన ట్రస్టీ సూకల రాంచంద్రారెడ్డి అధికారులను కోరారు. దేవాలయానికి ఎదురుగా ఉన్న 137 సర్వే నంబరులోని 137/1లో ఎ.3.07 గుంటలు, 137/2లో ఎ.11.38 గుంటల భూములను దేవాలయ అభివృద్ధికి వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత 25 సంవత్సరాలుగా తాను దేవస్థాన ట్రస్టీగా కొనసాగుతున్నానని, అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. 2005లో అప్పటి ఎమ్మెల్యే రెడ్యానాయక్ సహకారంతో అప్పటి జిల్లా కలెక్టర్ దమయంతి, రాహుల్ బోజ్జా, వాకాటి కరుణ తదితరుల దృష్టికి దేవాలయ భూముల విషయాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
137/1 సర్వే నంబరులోని 3 ఎకరాల 7 గుంటల భూమి 2011 సంవత్సరంలో ఆక్రమణకు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో ఎమ్మార్వో సర్వే నిర్వహించి భూ ఆక్రమణను అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 2026లో 137/1 భూమిలో గోశాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుండగా, కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అక్కడ ఇళ్లు, గుడిసెలు వేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవాలయానికి సంబంధించిన భూములపై సమగ్ర విచారణ జరిపి, రెవెన్యూ రికార్డుల ప్రకారం హద్దులను నిర్ధారించాలని కోరారు. దేవాలయ భూములను కాపాడటంతో పాటు గోశాల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూకల రాంచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.