గన్నీ పైసలు ఎప్పుడిస్తారు?
- గత ఏడాది యాసంగి సీజన్లో స్వయంగా సమకూర్చుకున్న రైతులు
- ఆ బిల్లుల కోసం నిరీక్షణ
- ఉలుకు పలుకు లేని మార్క్‌ఫెడ్ సంస్థ
- బండి సంపత్ కుమార్
మహబూబాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది యాసంగి సీజన్లో రైతుల నుండి మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ సంస్థ(Markfed company) కొంతమంది రైతులకు గన్నీ సంచుల పైసలు ఇప్పటివరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఊహించని విధంగా మక్కజొన్న పంట దిగుబడి వచ్చింది.
ప్రైవేటు ట్రేడర్లు మద్దతుకు మించి ధర పెట్టకపోవడంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా రాష్ట్రంలో సొసైటీలు, ఇతర కొనుగోలు సెంటర్ల ద్వారా మక్కజొన్న కొనుగోళ్లను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల టన్నులకు పైగా మక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్ సంస్థ క్వింటాలుకు రూ.2,400 చొప్పున కొనుగోలు చేసింది. రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన మక్కలను నాణ్యత ప్రమాణాల ప్రకారం సరిచూసి కొనుగోలుకు ఓ తర్వాత గన్ని సంచులను మార్క్‌ఫెడ్ సంస్థ కాంట్రాక్టర్ ద్వారా రైతులకు అందజేయాల్సి ఉంటుంది.
అయితే ఊహించని విధంగా పంట దిగుబడి రావడం వల్ల ఒక్కసారిగా రైతులు కొనుగోలు కేంద్రాలకు తాము పండించిన మక్కజొన్నలను తీసుకు రావడంతో కొనుగోళ్లకు అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యాయి. ఇందులో గన్ని సంచుల సమస్య, కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు ట్రాక్టర్ల ద్వారా మక్కల తరలింపు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు అప్పట్లో మార్క్‌ఫెడ్ సంస్థ రైతులు సొంతంగా గన్ని సంచులను సమకూర్చుకోవాలని, అందుకు బదులుగా మక్కల పైసలతో పాటు ఒక్కో గన్ని సంచికి రూ.21.80 చెల్లిస్తామని తెలిపింది.
దీంతో రాష్ట్రంలోని అనేక కొనుగోలు కేంద్రాల్లో రైతులు సొంతంగా గన్నీ సంచులు సమకూర్చుకొని, మక్కజొన్నలను తూకం వేయించి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారు. అయితే రైతులకు మక్కజొన్నల డబ్బులను దశలవారీగా చెల్లించిన సంస్థ గన్ని సంచుల బకాయి డబ్బులను మాత్రం ఇప్పటివరకు చెల్లించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ విధంగా చాలా చోట్ల లక్షల గన్ని సంచుల పైసలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే గత యాసంగి సీజన్లో రైతుల నుంచి 20 లక్షల బస్తాలకు పైగా మక్కలను కొనుగోలు చేయగా, అందులో కేవలం 7.50 లక్షల గన్ని సంచులను మాత్రమే సంస్థ కాంట్రాక్టర్ ద్వారా అందజేయగా, మిగిలిన 12.50 లక్షల గన్ని సంచులను రైతులే సమకూర్చుకున్నారు. ఆ విధంగా గన్ని సంచులకు సుమారు రెండు కోట్లకు పైగా బకాయి పడ్డ డబ్బులను ఇప్పటివరకు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
గన్ని సంచుల లెక్కల్లో తేడా?
వివిధ జిల్లాల్లో గన్ని సంచుల లెక్కల్లో తేడాలు భారీగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కొన్నిచోట్ల రైతులు సమకూర్చుకున్న గన్ని సంచులకు కాంట్రాక్టర్ ద్వారా 15 రూపాయల వరకు నగదు చెల్లించి, రూ.21.80 పైసలు ముట్టినట్లు రసీదులు తీసుకున్నారని, మరి కొన్నిచోట్ల గన్ని సంచుల లెక్క సరిపోలక బకాయి డబ్బులు చెల్లించడానికి ఆటంకంగా మారిందని చెబుతున్నారు. గన్ని సంచుల వ్యవహారంలో కొందరు చేతివాటం కూడా చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ జిల్లాలో గన్ని సంచుల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ ద్వారా మార్క్‌ఫెడ్ సంస్థ ఇచ్చిన గన్ని సంచులు, రైతులు సొంత ఖర్చులతో కొని తెచ్చుకున్న గన్ని సంచుల లెక్క పలు జిల్లాల్లో కొలిక్కి రాలేదని దీంతోనే రైతులకు గన్ని సంచుల డబ్బులు చెల్లించడానికి ఆటంకంగా మారిందని చెబుతున్నారు.
అన్ని విధాలా నష్టపోయాం..
133 బస్తాల మక్కలను మార్క్‌ఫెడ్‌కు రూ.27 చొప్పున ఖరీదు చేసి మక్కలు విక్రయించాను. రూ.3,500 పైగా ఖర్చు అయ్యింది. గన్ని సంచుల డబ్బులు తర్వాత బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అనేక ఇబ్బందులు పడి 25 రూపాయల నుండి 27 రూపాయల ధర పెట్టి గన్ని సంచులు కొని మార్క్ ఫెడ్ సంస్థకు మక్కలు అమ్మి నష్టపోయాం. మక్కల డబ్బులు నెలరోజుల తర్వాత జమ చేశారు. మక్కలను అమ్ముకొని మార్క్‌ఫెడ్ సంస్థ లాభాలు గడిచింది. మాకు మాత్రం గన్ని బస్తాల బకాయి డబ్బులు ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ప్రభుత్వం స్పందించి గన్ని సంచుల డబ్బులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.
పోలేపల్లి చెన్నారెడ్డి, అధ్యక్షుడు,
అభ్యుదయ రైతు సంఘం