టీఆర్‌టీతో ట్రాక్ పనులు వేగవంతం
ఆధునిక యంత్రంతో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
మహబూబాబాద్, అక్టోబర్ 6(విజయక్రాంతి): రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో(Railway track restoration works) ఆధునిక టీ ఆర్ టీ యంత్రం(TRT machine) వినియోగంతో వేగవంతంగా పనులను నిర్వహిస్తున్నారు. కాజీపేట విజయవాడ రైల్వే సెక్షన్లో కాజీపేట గార్ల స్టేషన్ వరకు డౌన్ మార్గంలో ఈ ఆధునిక టి ఆర్ టీ యంత్రాన్ని వినియోగిస్తూ రైల్వే ట్రాక్ పునరుద్ధరిస్తున్నారు. గతంలో రైల్వే కార్మికులను ఈ పనులకు అధిక సంఖ్యలో వినియోగిస్తుండగా, పునరుద్ధరణ పనులు ఎక్కువ సమయం పట్టేది.
ఇప్పుడు కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నా రు. నాలుగు గంటల బ్లాక్ సమయంలో దా దాపు 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ల మేరా పాత రైల్వే ట్రాక్ పూర్తిగా తొలగించి, కొత్తగా స్లీపర్లను ఏర్పాటు చేయడం ఈ యంత్రం ప్రత్యేకతగా నిలుస్తోంది.
టీ ఆర్ టీ (ట్రాక్ రిలేయింగ్ ట్రైన్) రైల్వే పట్టాలు, సిమెంట్ దిమ్మలను (స్లీపర్) ఒకేసారి చాలా వేగంగా, ఆటోమేటిక్గా మార్చడానికి ఉపయోగించే ఒక భారీ అత్యాధునిక ట్రాక్ నిర్మాణ మిషన్. ఈ మిషన్ ఒక వైపు ముందుకు కదులుతూనే.. పాత పట్టాలను, పాత సిమెంట్ దిమ్మలను తొలగిస్తుంది. అదే సమయంలో కొత్త దిమ్మలను అమర్చి, వాటిపై కొత్త పట్టాలను కూ డా అమర్చుకుంటూ వెళ్తుంది. ఈ రైలుపై ఒక ప్రత్యేక కదిలే క్రేన్‌ఉంటుంది. ఇది వెనుక ఉన్న వ్యాగన్ల నుండి కొత్త సిమెంట్ దిమ్మలను ముందుకు తెస్తుంది.
భూమి నుండి తొలగించిన పాత దిమ్మలను వెనుక వ్యాగన్లలోకి చేరుస్తుంది. ట్రాక్ కింద ఉండే రాళ్లను సమానంగా చేయడానికి ఈ మిషన్లో ఒక ప్రత్యేక నాగలి లాంటి అమరిక ఉంటుంది. ఇది కొత్త స్లీపర్లు కూర్చోవడానికి వీలుగా రాళ్లను చదును చేస్తుంది. మిషన్ కదులుతున్నప్పుడు పాత పట్టాలను పక్కకు నెట్టేస్తూ, కొత్త పట్టాలను రోలర్ల సహాయంతో సరైన స్థానంలోకి లాగుతుంది.
సాధారణంగా మానవ శ్రమతో రోజుకు కేవలం 120 మీటర్ల ట్రాక్ మాత్రమే మార్చగలిగితే, ఈ మిషన్ ద్వారా కేవలం 4 గంటల బ్లాక్ సమయంలోనే దాదాపు 1 కిలోమీటరు పైగా దూరంలో కొత్త ట్రాక్ను విజయవంతంగా వేస్తోంది.ఈ మిషన్ పక్క ట్ప్రా పనిచేస్తున్నప్పుడు, దాని పక్కనే ఉన్న మరొక లైన్ గుండా రైళ్ల రాకపోకలను ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
యంత్రం పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన రైల్వే జనరల్ మేనేజర్
ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మహబూబాబాద్ - తాడ్లపూసపల్లి సెక్షన్ల మధ్య అత్యాధునిక టీ ఆర్ టీ యంత్రంతో భారీగా ట్రాక్ మార్పిడి పనులను వేగంగా నిర్వహిస్తున్న పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ క్రేన్ల అవసరం లేకుండా, తక్కువ కార్మికులతోనే అత్యంత సురక్షితంగా పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా కొత్త ట్రాక్ పూర్తి కావడం వల్ల ఈ సెక్షన్ లో రైళ్ల గరిష్ట వేగం, ప్రయాణీకుల భద్రత గణనీయంగా పెరుగుతాయన్నారు.