వాగులపై వంతెనలు..

21-11-2026 | 05:25am

ఏళ్లనాటి ప్రయాణ కష్టాలకు తెర

‘వేం’ కృషితో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కొత్త బాటలు

మహబూబాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాకపోకలు భారంగా మారేవి. ప్రతి వర్షాకాలంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు, కేసముద్రం మండలాల్లో వట్టి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రెండు మండలాలతో పాటు అర్పణ పల్లి, రాజనపల్లి, కాట్రపల్లి, నాయకపల్లి, తీగల వేణి, బొల్లెపల్లి, వరంగల్ జిల్లా నాగారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి.

అత్యవసర వైద్య సేవలు, విద్యార్థుల ప్రయాణాలు, రైతుల వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఇలాంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి(Rajya Sabha MP Vem Narender Reddy) కృషితో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి వాగులపై వంతెనల నిర్మాణాలు చేపట్టడం ప్రజలకు ఎంతో ఊరటనిస్తోంది. గతంలో అర్పణ పల్లి వద్ద వట్టివాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా, తాజాగా గూడూరు నెక్కొండ మార్గంలో, అర్పణ పల్లి నుండి నాగారం మార్గంలో వట్టివాగు, మద్దెల వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.

అర్పణ పల్లి నాగారం గ్రామాల మధ్య 20 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ వంతెన నిర్మాణం పనులు ప్రారంభించారు. గతంలో వాగులు దాటేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది. వరద ఉధృతి పెరిగితే ఒక్కోసారి కొన్ని రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం వట్టి వాగు పై అర్పణ పల్లి, గూడూరు వద్ద, అర్పణ పల్లి కాట్రపల్లి మద్దెల వాగు పై పటిష్టమైన వంతెనలు నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో ఇక అన్ని కాలాల్లోనూ సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమమవుతోంది.

అభివృద్ధికి అనుసంధాన వారధులు

వంతెనల నిర్మాణం కేవలం రెండు ప్రాంతాలను కలపడమే కాకుండా గ్రామీణ అభివృద్ధికి వారధులుగా నిలుస్తున్నాయి. రైతులు పండించిన పంటలను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరుకునేందుకు, రోగులు ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రయాణ భారం తగ్గుతోంది. వ్యాపార, రవాణా కార్యకలాపాలు కూడా వేగవంతమవుతున్నాయి.

నాణ్యతతో నిర్మాణాలే కీలకం

వాగులపై వంతెనల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్రోచ్ రోడ్లు, రక్షణ గోడలు, డ్రైనేజీ వ్యవస్థలను కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. అప్పుడే వంతెనల నిర్మాణ లక్ష్యం నెరవేరి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది. ఏళ్ల తరబడి వర్షాకాలంలో రాకపోకల కోసం అవస్థలు పడిన గ్రామీణ ప్రాంత ప్రజలకు వాగులపై వంతెనల నిర్మించడం అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రయాణ కష్టాలను తొలగిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే నిర్మాణాలు గ్రామీణ ప్రగతికి బాటలు వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు