కుటుంబ దత్తత కార్యక్రమం నిర్వహణ

07-11-2026 | 11:49pm

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవడమే లక్ష్యం

జడ్చర్ల: ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్‌నగర్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో 2026 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల కోసం జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామంలో కుటుంబ దత్తత కార్యక్రమాన్ని (Family Adoption Programme) నిర్వహించారు.

కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె. కోటేశ్వరమ్మ నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు, పీజీ వైద్య విద్యార్థులు, హెల్త్‌కేర్ సిబ్బంది పాల్గొన్నారు. 2026 బ్యాచ్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

జాతీయ వైద్య కమిషన్ (NMC) వైద్య విద్యా పాఠ్యప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. కుటుంబాల ఆరోగ్య అవసరాలను అంచనా వేయడం,వివిధ ఆరోగ్య సమస్యలను గుర్తించడం, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రాథమిక వైద్య సేవల ప్రాముఖ్యతను వివరించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి గంగాపూర్ గ్రామ ప్రజలు, స్థానిక ఆరోగ్య సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం పేర్కొంది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వైద్య సిబ్బంది, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు విభాగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు