రిపోర్టర్ కృష్ణ సతీమణి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణకు పరామర్శ.. మృతురాలి మృతదేహానికి నివాళులు
పెద్దపల్లి,(విజయక్రాంతి): మారేడుపల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ కృష్ణ సతీమణి మృతి చెందడం పట్ల రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్(Former MLA Korukanti Chander) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో రిపోర్టర్ కృష్ణ కూడా గాయపడటంతో చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కోరుకంటి చందర్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న కృష్ణను పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతురాలి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ విషాద సమయంలో కృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని కోరారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.