ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
* లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను పూర్తి చేసుకోవాలి
* అదనపు కలెక్టర్ నగేష్
* కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్ట్‌ల ప్రదానం
పాపన్నపేట: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.
శనివారం మండల పరిధిలోని కుర్తివాడ గ్రామాన్ని సందర్శించిన ఆయన ముందుగా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాల పురోగతిని, పనుల స్థితిగతులను పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా లబ్ధిదారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
కరాటేలో విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు
అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్, కరాటేలో ప్రతిభ కనబరిచి వివిధ స్థాయిల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు బెల్ట్‌లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు. చదువుతోపాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్, తహసీల్దార్ సతీష్, కరాటే మాస్టర్ మణి, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోక్యానాయక్ తదితరులు ఉన్నారు.